హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు తమ పునాది నీళ్లు, నిధులు, నియామకాలని.. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటిని సాకారం చేసుకొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ ట్యాగ్లైన్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఆయన ఆవిష్కరించారు. గురువారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో నీళ్లు, నిధులు, నియామకాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. నీళ్లు: కేంద్ర ప్రభుత్వ సహకారం జీరో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టింది. చైనాలోనో మరో ప్రాంతంలో మాత్రమే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకొనే స్థితి నుంచి పాలకులు, నాయకులు తలచుకొంటే ఇండియాలో కూడా అద్భుతాలు చేయవచ్చని నిరూపించింది తెలంగాణ. మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరుల పునరుద్ధరణ, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించి భారతదేశానికి దిక్సూచిగా నిలిచింది. 9 ఏండ్ల స్వల్పకాలంలోనే 75 ఏండ్లల్లో జరగని ఎన్నో పనులను తెలంగాణ చేసి చూపింది.
దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. అది మా లెక్కకాదు. ఆర్బీఐ గణాంకాలే (ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.8 లక్షలు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం రూ.3.17 లక్షలు). తలసరి ఆదాయంలో భారతదేశంలోనే అగ్రభాగాన నిలిచాం. సంపద సృష్టించడమే కాదు.. దాన్ని అన్ని వర్గాల సంక్షేమం కోసం పంచటంలో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ‘అగ్రవర్ణాలైనా.. అణగారిన వర్గాలైనా.. అందరినీ తెలంగాణ సమాదరిస్తుంది.
పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ (2004 నుంచి 2014 దాకా ) హయాంలో ఏపీపీఎస్సీ సహా ఇతర మార్గాల ద్వారా 26 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అదే మా 9 ఏండ్ల పాలనలో 800 శాతం అధికంగా ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా 32 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. మొత్తం కలిపి 2 లక్షల 21 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అలాగే ప్రైవేట్ రంగంలో దాదాపు 24 లక్షల పైచిలుకు మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాం. ఇలా తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ను సంపూర్ణం చేశాం. స్వతంత్ర భారతదేశంలో సాంకేతిక సమతుల్యతను సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ తెలిపారు.