2014లో మోదీ సార్ ఏం చెప్పారు ఆప్‌లోగ్ జన్‌ధన్ ఖాతా కోలో.. మై ధన్‌ధన్ పంథ్రాలాక్ దాల్దేతూ అన్నడు. కాలా ధన్ లాతో.. కాలా ధన్ లాతో అన్నడు. కాలా ధన్ ఏందో కానీ కాలా చట్టాలు(నల్ల చట్టాలు) తెచ్చారు. నల్లధనం ఏది అంటే తెల్లముఖం వేస్తడు. వచ్చినయా ఎవరికన్నా పంథ్రాలాక్? ఓట్ల కోసం వచ్చిన బీజేపోళ్లను నిలదీయండి. రూ.15 లక్షలు వచ్చినోళ్లు బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేయండి. రూ.15 లక్షలు రానోళ్లు, కేసీఆర్ రైతుబంధు వచ్చినోళ్లు మాకు వేయండి.
– మంత్రి కేటీఆర్
Minister KTR | మంచిర్యాల, నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవ్వడో కాదు.. పక్కా ఆరెస్సెస్ మనిషి’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అసలుసిసలైన అతివాద సంస్థ మనిషే తెలంగాణ పీసీసీకి చీఫ్‌గా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తాను చెప్పట్లేదని, కాంగ్రెస్‌లో ఉండి, సీఎంగా పని చేసి, ఆ పార్టీ తీరునచ్చక రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్ రాసిన లేఖలో ఉన్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోనియాకు అమరీందర్ రాసిన లేఖ ప్రతిని ప్రజల ముందుంచారు.
‘నేను సైన్యంలో పని చేశా. నిబద్ధతతో సేవ చేసిన. మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి. అతివాద మనిషిని, ముస్లింలను ద్వేషించే వ్యక్తిని పీసీసీ చీఫ్‌గా పెట్టిండ్రు’ ఆ లేఖలో పేర్కొన్నట్టు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు బీజేపీ మనిషి అని, గాంధీని చంపిన గాడ్సే ఆరెస్సెస్ మనిషేనని స్పష్టం చేశారు. అలాంటి రేవంత్‌రెడ్డి అమాయక ముస్లింలను రెచ్చగొడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. బుధవారం మంత్రి కేటీఆర్ నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.753 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ-27ని, పోచంపాడ్ వద్ద రూ.300 కోట్లతో నిర్మించే పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.135.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేశారు. రెండు పట్టణాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ ప్రసంగాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘ఎన్నికలు అనగానే ప్రధాని మోదీ గాలి మోటర్ల వచ్చిండు. గాలి మాటలు చెప్పిండు. అవతల పడ్డడు. ఆయన వచ్చి బీఆర్ఎస్ వాళ్లు, కాంగ్రెసోళ్లు ఒకటే అంటరు.. కాంగ్రెసోళ్లు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ వచ్చి బీఆర్ఎస్వాళ్లు, బీజేపీవాళ్లు ఒకటే అంటరు.
పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఆయన ముని మనువళ్లు భవిష్యత్తులో గొప్పగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో రైతుబంధు అనే విప్లవాత్మకమైన పథకం మా తాతనే తెచ్చిండ్రని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయమంత్రిగా ఆయన ఉన్నప్పుడే రైతుబంధు ప్రారంభమైంది. 70 ఏండ్లలో ఎవరికీ రాని ఆలోచన.
– మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ కాంగ్రెస్ బీ-టీం అని బీజేపోడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెసోడు అంటడు. నేను కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఒక్కటే చెప్తున్నా మేం రోషం గల్ల బిడ్డలం. ఆత్మగౌరవం కలిగిన బిడ్డలం. మేం ఢిల్లీ గులాములం కాదు. గుజరాత్ గులాములం కాదు. ఢిల్లీ బానిసలం కాదు. ఎవని అయ్యకు భయపడం. ఎవనికీ బీ-టీమ్ కాదు. మేం తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీ. వారికే మేం ఏ-టీమ్. తెలంగాణ గల్లీల్లో ఉండే తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు, అన్నలు ఏం అనుకుంటున్నరనేదే మాకు ముఖ్యం.
ధరలు పెంచినందుకా మోదీ దేవుడు?
ఇక్కడ ఒకాయన ఉన్నడు బండి సంజయ్ అని. ఆయన అంటున్నడు మోదీ దేవుడన్న.. దేవుడు అని. మరి ఎవరికీ దేవుడు అంటే చెప్పడు. రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1,200 చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా మోదీ? రూ.70 పెట్రోల్‌ను రూ.110 చేసినందుకు మా తమ్ముళ్లకు, ఉద్యోగులకు దేవుడా? రూ.60 డీజిల్‌ను రూ.100 చేసినందుకు మా రైతన్నలకు దేవుడా? పప్పు ధర, ఉప్పు ధర, అన్నింటి ధరలు పెంచినోడు దేవుడా? ఆగం అయిదామా మళ్లీ? నాకు మోదీతో ఏం పంచాయితీ లేదు. కానీ ఆయన నిజామాబాద్‌లో మాట్లాడిన మాటలు గమ్మతి అనిపిస్తున్నయ్.
అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పని చేస్తున్నది. మగ్ధూం మోహినుద్దీన్ చెప్పినట్టు సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పార్టీ మాది. 200 మైనార్టీ గురుకులాలను తీసుకొచ్చాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఒక్కపైసా అయినా ఖర్చు చేసిందా? హిందూ దేవాలయాల మాదిరిగానే కేసీఆర్ తెలంగాణలో 17 వేల మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు, మోజాంలకు ప్రతినెల జీతం ఇస్తున్నరు.
24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం
దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. అయితే, ఎక్కడున్నది కరెంట్ మాకు కనబడుత లేదు, ఎక్కడుందో చూపెట్టు అని కాంగ్రెసోళ్లు అడుగుతున్నరు. ఏ ఊరికైనా పోయి కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తది. ఎన్కట తాగునీటి తండ్లాట ఎట్లుండే. నీటి కోసం యుద్ధాలు. నల్ల కాడా లొల్లి. ఇప్పుడున్నదా? ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగా అని చెప్పింది కేసీఆర్ మాత్రమే. పోచారం రాజకీయాల్లోకి వచ్చి 47 ఏండ్లు అయ్యింది. 1976 రాజకీయాల్లోకి వచ్చారు. నాడు ఎస్సారెస్పీ, నిజాంసాగర్ నిండక, కాలం కాక రైతుల కష్టాలు మాములుగా లేకుండే. సీఎం ముందు కాళ్లావేళ్లాపడ్డం. దండం పెట్టినా నీళ్లు ఇయ్యని రోజులు ఎన్నో అని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తుంటే కండ్లలో నీళ్లు తిరిగినయ్. ఇపుడున్నదా ఆ పరిస్థితి? ఎస్సారెస్పీ పునరుజ్జీవం చేశాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మోదీవి చిల్లర మాటలు: పోచారం
ఢిల్లీ నుంచి వచ్చిన మోదీ గల్లీ మాటలు, చిల్లర మాటలు మాట్లాడారని ప్రధానిపై స్పీకర్ పోచారం మండిపడ్డారు. ‘నిన్న ప్రధానమంత్రి వచ్చిండు. పీఎం అంటే హోదా. ఢిల్లీ నుంచి నిజామాబాద్‌కు వచ్చి గల్లీ మనిషిలా మాట్లాడిండు. మొన్నటి ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఎంపీలు గెలువరు. ఎమ్మెల్యేలు గెలువరు. విదేశాల్లో తెలంగాణ అంటే గౌరవం తెచ్చిన వ్యక్తి కేటీఆర్. ఐటీ సెక్టార్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తి కేటీఆర్. బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో సాగునీరు, తాగునీరు, రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, వైద్యం, విద్య, సంక్షేమ కార్యక్రమాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు సాధించుకున్నం. ఇవన్నీ కలుపుకుని లెక్కగడితే రైతుబీమా 14 వేల మందికి, కల్యాణలక్ష్మి 15 వేల మందికి, కేసీఆర్ కిట్ 30 వేల మందికి, డబుల్ బెడ్రూం 11 వేల మందికి, గొర్లు 7,500 మందికి, 250 చెరువుల్లో ఉచిత చేపపిల్లలు.
మొత్తం 9 ఏండ్లలో రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చాక సంక్షేమ ఫలాల విలువ రూ.10 వేల కోట్లు. ఇవన్నీ తెలంగాణ వస్తేనే సాధ్యమైంది. ఒకప్పటి పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. గ్రామాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ప్రేమ, గౌరవంతో లక్ష్మీ పుత్రుడని నాకు కేసీఆర్ పేరు పెట్టి అభివృద్ధిని అప్పగించారు. రూ.500 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకున్నాం. మా నియోజకవర్గంలో లక్షా 85 వేల ఓట్లుంటే వీరందరికీ ఏదో ఒకటి అందింది. ఇట్ల ప్రతి నియోజకవర్గంలో ఉన్నది’ అని వెల్లడించారు. కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, జోగు రామన్న, హన్మంత్ షిండే, ఖానాపూర్, బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థులు జాన్సన్ నాయక్, అనిల్ జాదవ్, పోచారం భాస్కర్‌రెడ్డి, దఫేదార్ శోభ, వేణుగోపాలాచారి, దఫేదార్ రాజు, పోచారం సురేందర్‌రెడ్డి, డా.పోచారం రవీందర్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ నన్ను సీఎం చేయాలనుకున్నడు అంట.. సరే చేద్దామనుకున్నరు అనుకుంటే మోదీకి ఎందుకు చెప్తరు? గాయన దగ్గర పర్మిషన్ తీసుకునే అవసరం ఏం ఉంది మాకు? ఆయన మోతాదులమా మనం ఏమన్న? మా పార్టీలో ఎవరు సీఎం కావాలో మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజలు నిర్ణయిస్తరు. మోదీ దగ్గర ఎన్వోసీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం ఉన్నది? గా కర్మ ఏం ఉన్నది? మోదీ చెప్పే మాటలు ఎంత ఝూటానో దాన్ని బట్టే అర్థం అవుతుంది.
– మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ సన్నాయి నొక్కులకు ఆగం అవుదామా?
ఇగ కాంగ్రెసోళ్లు ఉన్నరు.. వాళ్లదైతే ఇంకా గమ్మతి అనిపిస్తది. ఒక్క చాన్స్ ఇయ్యండి.. ఒక్క చాన్స్ ఇయ్యండి అని బతిమిలాడుతున్నరు. ఒక్క చాన్సా.. ఎన్ని చాన్సులు ఇచ్చినం మనం? కాంగ్రెసోళ్లకు 55 ఏండ్లు 11 చాన్స్‌లు ఇచ్చినం. 55 ఏండ్లు చాన్స్ ఇస్తే కరెంట్ ఇయ్యనోడు, సాగు, తాగు నీరు ఇయ్యనోడు ఇయ్యాల మళ్లా వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వండి ఇది చేస్తాం.. అది చేస్తాం.. అంటున్నరు. ఆ పార్టీ పీనుగు లెక్క. చెవిలో ఆరు గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు అంటే ఆగమైపోదమా? దయచేసి ప్రజలారా మోసపోవద్దు. ఆలోచించాలె.
Ktr
జాకీలు పెట్టినా బీజేపీ లేవదు
మోదీతో తెలంగాణకు తొమ్మిదిన్నరేండ్లలో ఒరిగింది సున్నా. నిన్న పీఎం వచ్చి ఇన్ని ఇచ్చినం, అన్ని ఇచ్చినం అంటుండు. తెలంగాణకు రావాల్సిన బాకీ సంగతి ఏంది? బూతులు తిట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, జాకీలు పెట్టినా బీజేపీ ఇక్కడ లెవ్వదు. బీజేపీ పని అయిపోయింది. చావు నోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్ ఓ వైపు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ మరో వైపు. ఓటుకు నోటులో దొరికినోడి కథే ఇప్పుడు సీటుకు నోటు నడుస్తుందని కాంగ్రెసోళ్లే చెప్తున్నరు. అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటున్నడు. రేవంత్ అడిగిన డబ్బు ఇవ్వలేక ఈ రోజే ఓ కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్‌సాగర్‌లో ఆత్మహత్య చేసుకోబోయిండు. మన మ్యానిఫెస్టో వస్తుంది. మన మ్యానిఫెస్టో వాళ్ల కంటే తాత మాదిరి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయి. పసుపుబోర్డు అన్నా, ఇంకోటన్నా మోదీవి దింపుడు కల్లం ఆశలే. తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష కేసీఆర్.
మొన్న పదిహేను, ఇరవై రోజుల కింద ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలోని ముక్రా(కే) అనే ఒక ఊరు ఉంటది. ఆ ఊరు సర్పంచ్ మీనాక్షీ గాడ్గె. ఆ ఊరిలో ఉండే పెద్ద మనుషులు అందరూ ఊర్ల గుమిగూడిండ్రు. కేసీఆర్.. మా పెద్ద కొడుకు. మాకు రూ.2 వేల పింఛన్ ఇచ్చి కాపాడిండు. అందుకే ఆయన నామినేషన్ పైసలు, ఆయన కొడుకు కేటీఆర్ నామినేషన్ పైసలు మేం ఇస్తాం అని చెప్పి మాకు లక్షల రూపాయాలు పంపిండ్రు. ఇంతకంటే విలువైన బహుమానం ఉంటదా?
– మంత్రి కేటీఆర్