మనకు తెలియకుండానే శరీరంలోని ఎముకలను వలుచుకుతినే మహమ్మారి ఫ్లోరోసిస్. దాని దెబ్బకు చేతులు, కాళ్లు వంకర్లు పోయి.. జీవితాలు ఛిద్రమైపోతాయి. ఉమ్మడి ఏపీలో నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ కష్టాలు అన్నీఇన్నీ కావు.. తమను ఆదుకోవాలని బాధితులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేశారు. వాటిలో చురుగ్గా పాల్గొన్న మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశల స్వామి.. ఐదుగురు ప్రధానులు, ముగ్గురు రాష్ట్రపతులను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఫ్లోరోసిస్‌కు పోస్టర్‌బాయ్‌గా మారినా.. తెలంగాణ వచ్చేవరకు ఆయన బతుకు దినదిన గండమే. ఉమ్మడి రాష్ట్రంలో మూడుపూటలా తిండికి కొట్లాడిన స్వామికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా ఆపన్న హస్తమైంది. మిషన్ భగీరథ జీవ ధార అయ్యింది. టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్.. గొప్ప భరోసా అయ్యారు. స్వామికి డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. జీవిక కోసం బార్బర్ షాప్ పెట్టించింది. నల్లాద్వారా ఇంటికే స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నది. ఇప్పుడు స్వామి జీవితం గాడిన పడింది.
పరిచయం చేయడానికి పేరు, ఊరు తప్ప ఇంకేవీ అవసరం లే. చూస్తేనే వాళ్ల బాధేమిటో? కారణమేందో? ప్రాంతమేదో? అర్థమైపోతది. ఫ్లోరోసిస్ సమస్యకు ప్రపంచవ్యాప్తంగా పేరుపడ్డ నల్లగొండ బిడ్డే అంశల స్వామి. ఊరు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం. ఫ్లోరైడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నీళ్లు తాగితే ఈ రోగమొస్తదని అందరికీ ఎరుకే. కానీ, స్వామికి అట్ల రాలే. ఆ విషపు నీళ్లు తాగిన తల్లికడుపులో పడ్డందుకు స్వామికి ఈ శిక్ష పడ్డది. ఫ్లోరైడ్ జలం గర్భంలో ఉన్న పిండంలో తయారయ్యే ఎముకల్ని మెలితిప్పింది. అమృతంలాంటి అమ్మపాలను కూడా ఫ్లోరైడ్.. విషంగా మార్చింది.
పుట్టినప్పుడు బిడ్డ బాగానే ఉన్నడని తల్లిదండ్రులు అనుకున్నరు. అందరిలెక్కే ఆడుతున్నడని సంబురపడ్డరు. అయిదేండ్లు రాంగనే ఒళ్లునొప్పులని కూలబడుతుంటే దవాఖానకు తీస్కపోయిన్రు. ‘ఇది ఫ్లోరోసిస్’ అని డాక్టర్లు చెబితే బాధపడ్డరు. ఆ తర్వాత కాళ్లు, చేతులు వంకర్లు పోయి, ఎదుగుదల ఆగిపోయిన స్వామి తోటి పిల్లల్లా బడి ముఖం చూడలే. అందరితో కలిసి ఆడలే.
– నమస్తే తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
పిచ్చిదైన తల్లి
కాళ్లు, చేతులు వంకర్లు పోయిన ఫ్లోరోసిస్ బాధితులు నడవడం కష్టం. ఎవరో ఒకరు ఎత్తుకుని మోయాల్సిందే. తమ పనులు తాము చేసుకోలేరు. అట్లని ఎవరైనా ముందుకొస్తే వాళ్ల సాయం తీసుకోలేరు. స్కెలెటన్ ఫ్లోరోసిస్ బాధితుల్ని ఎట్ల పట్టుకోవాలో తెలిసుండాలె. ఎట్లబడితె అట్ల పట్టుకుంటే ఎముకలు ఫటఫటమని విరిగిపోతయ్. పదిహేను రోజులు కదలకుండా పడుకుంటె మళ్లా అయ్యే అతుక్కుంటయ్. అన్ని రోజులు కదలకుండా ఉండాల్నంటే.. ఎంత కష్టం? అది ఇంకో శిక్ష. ఇట్ల లెక్కలేనన్నసార్లు ఎముకలు విరిగినయని స్వామి చెప్తున్నడు. కొన్నాళ్లకు స్వామి చెల్లెను కూడా ఫ్లోరోసిస్ కాటేసింది. ఇద్దరు బిడ్డలు ఇట్లయిర్రేందని ఆ తల్లి మనాదివడ్డది. కన్న బిడ్డలకు విషం తాపించినానని ఆ తల్లి ప్రేమ పశ్చాత్తాపంతో అంతులేని శోకంతో ఏండ్లు గడిపింది. చివరకు పిచ్చిదైపోయింది. సరిగా తినక, ఫ్లోరైడ్ విషం దేహంలోకి ఎక్కి ఆమె ఎముకలు సత్తువలేకుండా పోయినయ్. చివరికి నిలబడలేని, నడవలేనిదైపోయింది.

అందరికీ ఆసరా
స్వామి తండ్రి కులవృత్తి మంగలిపని. ఆ రోజుల్లో శివన్నగూడెంలో తనదొక్కటే బార్బర్ షాపు. షాపులో తనుంటే తన భార్య.. బిడ్డల్ని సరిగా చూసుకోలేకపోయేది. ఫ్లోరోసిస్ వల్ల శారీరకంగా, మానసికంగా కుంగి పోయింది. జీవచ్ఛవంలా బతికే ఆ తల్లి, కన్నబిడ్డను సాకే పరిస్థితి లేకపోయేసరికి చిన్న బిడ్డ చనిపోయింది. పెద్ద బిడ్డే వండి పెడుతూ ఆ ఇంటికి దిక్కయింది. కొడుకునైనా కాపాడుకోవాలన్న తపనతో తండ్రే స్వామిని ఎత్తుకుని తిప్పడం, స్నానం చేయించడం వంటి పనులన్నీ చేసేటోడు. అట్ల రోజులు గడుస్తుంటే స్వామి వాళ్ల అక్క పెండ్లి అయ్యి వెళ్లిపోయింది. తన బాగోగులు చూసుకునేటోళ్లు లేకపోయేసరికి కాసేపు షాపు, కాసేపు ఇంట్లో పనులు చేస్తూ అంశల సత్యనారాయణ కుటుంబాన్ని నడిపించిండు. ఫ్లోరోసిస్ అతన్నీ వదల్లేదు. నరాలు సచ్చుబడ్డయి. నిలబడలేక పోతున్నడు. షాపు మూసేసిండు. అప్పుడే వాళ్లను ఆసరా ఆదుకున్నది. స్వామికి వికలాంగుల పెన్షన్ రూ.3 వేలు, తండ్రి సత్యనారాయణకు వృద్ధాప్య పెన్షన్ రూ.2,016 వచ్చినయ్. ‘దేవుడిలా వచ్చిండు మా కేసీఆర్. ఆ సారే లేకుంటే కరోనా టైమ్‌లో మేము ఏమై పోయేవాళ్లమో’ అంటున్నడు స్వామి.
ప్రధానికి చెప్పినా మారలే
తనలా రేపటి తరం బాధపడకూడదని స్వామి ఫ్లోరైడ్ విముక్తి కోసం పోరాడిండు. జలసాధన సమితి, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో చేరి జిల్లా కలెక్టరేట్ నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ దాకా టెంటేసి దీక్ష చేసిండు. ఐదుగురు ప్రధానమంత్రులు, ముగ్గురు రాష్ట్రపతులను కలిసిండు. పుట్టేవాళ్లనైనా కాపాడండి. కృష్ణా నీళ్లివ్వండి అని అడిగిండు. పీవీ నర్సింహారావు, వాజ్‌పేయి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్సింగ్ను కలిసిండు. అందరూ నల్లగొండ బిడ్డ చెప్పిన మును‘గోడు’ విన్నరు. చూస్తామనకుండా చేస్తామన్నారు. కానీ, నీళ్లు తేలే. తెలంగాణ వచ్చినంక ఫ్లోరైడ్ని భూస్థాపితం చేసేందుకు మిషన్ భగీరథ నీళ్లొచ్చే సరికి స్వామి పోరాటం ఆపిండు.
మళ్లీ జీవితాన్నిచ్చిన కేటీఆర్

నల్లగొండ జిల్లాలో ఇంటింటికీ కృష్ణా నీళ్లొచ్చాక స్వామి ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటం ఆగిపోయింది. ఇక మనుగడ కోసం పోరాటంలో మునిగిపోయిండు. సౌడు మిద్దె శిథిలమైంది. వానొస్తే కురుస్తది. ఎప్పుడు కూలుతదో తెల్వదు. ఆ ఇంటిని ఫొటోలు తీసి ఒకరోజు మంత్రి కేటీఆర్‌కు వాట్సాప్ చేసిండు. ‘అంత పెద్ద సారు చూస్తడా? చూ స్తే స్పందించేంత తీరికుంటదా? అనుకున్న. నేను ఫోటోలు వాట్సాప్ చేయంగనే చూసిండు. నేను అనుకున్న దానికంటే స్పీడ్‌గా స్పందించిం డు’ అని ఆశ్చర్యపోతూ చెప్తాడు స్వామి. వెంటనే నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశాలు పోయినయ్.
కలెక్టర్ తెల్లారే అధికారులను పంపిండు. కొన్నాళ్లకు ‘నాకు సాయం గావాలె సారు’ అని మళ్లీ కేటీఆర్‌కి వాట్సాప్ మెసేజ్ చేసిండు. ‘మెసేజ్ పెట్టిన నిమిషాలకే కేటీఆర్ పీఏ నుంచి ఫోన్ వచ్చింది. ఏడున్నవ్ స్వామీ అనడిగిండు. ఆ రోజు నేను హైదరాబాద్‌లోనే ఉన్న. నా దగ్గరకే వచ్చి, కారులో ఎక్కించుకొని సక్కంగ నల్లగొండ కలెక్టర్ ఆఫీస్‌కి తీసుకుపోయిండు. మా పరిస్థితి ఇట్ల ఉన్నదని చెప్తే, డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తమన్నరు. బతకటానికి కటింగ్ షాప్ పెట్టిస్తే, మనుషుల్ని పెట్టి నడిపించుకుంట అని చెప్పిన. వారం రోజులకు మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ పిలిస్తే పోయిన. కటింగ్ షాపు పెట్టిస్తమని మాటిచ్చిండు. ఇంటికి రూ.5.04 లక్షలు, షాప్‌కు రూ.2.7 లక్షలు ఇచ్చిండు.
మర్రిగూడ మండలం ఎంపీడీవో దగ్గరుం డి షాపు ఏర్పాటు చేయించిండు. రెండు చైర్లు, కత్తెర్లు, అద్దాలు, సీలింగ్, ఇంటీరియర్ పెట్టించారు. ఒక మనిషిని పెట్టి షాపు నడిపిస్తున్న. రోజూ రూ.వెయ్యి ఆదాయం వస్తది. ఇల్లు ఫూర్తయింది. మిగిలిపోయిన చిన్నచిన్న పనులు చేయిస్తనని కర్నాటి విద్యాసాగర్ సార్ హామీ ఇచ్చిండు. పెన్షన్ భరోసా, కేటీఆర్ సార్ సాయం, విద్యాసాగర్ హామీతోని మా బతుకు కొంచెం బాగుపడ్డది. మళ్లీ మాకు మంచి రోజులొచ్చినయ్.’ అని సంతోషంగా చెప్తున్నడు 33 ఏండ్ల బాలుడు అంశల స్వామి.