పెట్రో ధరల పెంపుపై కేంద్రమంత్రి హర్దీప్సింగ్పూరీకి మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సర్కారు పెట్రోలు, డీజిల్పై అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్నదని, 2014 నుంచి 2021 వరకు ₹56,020 కోట్ల వ్యాట్గా వసూలు చేసిందని హర్దీప్సింగ్పూరి ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ ఉత్పత్తులపై తమ సర్కారు వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదన్నారు.
2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉంటే.. ఇప్పుడు కూడా అదే ధరకి క్రూడాయిల్ దొరుకుతున్నదని, కానీ పెట్రోల్ లీటర్కు 120 రూపాయలకు పైగా ఎలా పెరిగిందో చెప్పాలని కేంద్రమంత్రిని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పెరుగుదలకు కేంద్రంలో ఉన్న నాన్ పర్ఫార్మెన్స్ అస్సెట్ (ఎన్పీఏ) గవర్నమెంట్ అయిన మీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సెస్సులు కారణం కాదా? అని నిలదీశారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటి దాకా 26 లక్షల కోట్ల రూపాయలు సెస్సుల రూపంలో ప్రజల నుంచి గుంజినది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే మీరు కేంద్రం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే 70 రూపాయలకు పెట్రోల్, 60 రూపాయలకు డీజిల్ భారతదేశ ప్రజలకు అందించే వీలుందని, ఈ విషయాన్ని మీ ప్రధానమంత్రికి చెబితే మంచిదని సూచించారు.