Minister KTR | రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమిపూజ చేశారు. దేశంలోనే మొదటి యూనిట్‌ను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోనిన్ సంస్థ.. రూ.300 కోట్లకుపైగా పెట్టుబడితో 40ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చిందని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టె పరిశ్రమలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగం కల్పించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు మీ ప్రాంతాల్లో పరిశ్రమ వస్తే సహకరించాలని కోరారు. కొంతమంది రాజకీయాలు చేస్తారని, నిజానిజాలు తెలుసుకోవాలని, ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారిందన్నారు. భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని.. తెలంగాణలో ఐదురకాల విప్లవాలు ఆవిష్కృతమవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.