హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్‌ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి లైన్కట్టి దాడి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతికాముక రాష్ట్రంగా ముందుకు సాగుతున్న తెలంగాణలో చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, అమిత్‌షా, యోగి సహా అనేక మంది ఢిల్లీ, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి మన కేసీఆర్‌ను ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఎవలకు ఏం తక్కువ చేసిండని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మునుగోడు నియోజకవర్గాల నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్, మునుగోడు నుంచి నక్కా రవీందర్, జూబ్లీహిల్స్ నుంచి అశోక్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్, గణేశ్ ముదిరాజ్, బలరాం, వినయ్‌కుమార్, మహేశ్ ముదిరాజ్ సహా వందలాది మంది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఇచ్చేది సీఎం కేసీఆర్ కాకుండా దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? వృద్ధులకు సీఎం కేసీఆర్‌లాగా ఆసరాగా నిలిచేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను మూడోసారి గెలిపిస్తే ఆసరా పింఛన్ రూ.2,016 నుంచి రూ.5,016 పెంచబోతున్నట్టు చెప్పారు. 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేల చొప్పున సౌభాగ్యలక్ష్మి రానున్నదని తెలిపారు. గ్యాస్ సిలిండర్‌ను మోదీ రూ.1,200 చేస్తే సీఎం కేసీఆర్ దాన్ని రూ.400కే ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెల్లకార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఇంటింటికీ బీమా-కేసీఆర్ ధీమా పేరుతో రూ.5 లక్షల బీమా రాబోతున్నదని వివరించారు.
కాంగ్రెస్‌లో ఆర్థిక తీవ్రవాదులకు, డబ్బు సంచులతో వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారనే విషయాన్ని తట్టుకోలేక అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ సృష్టిస్తున్న అరాచక రాజకీయం వల్ల అనేక మంది బీసీలు అవమానాలపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిణామాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లాకు సంభాని చంద్రశేఖర్, ఎడవెల్లి కృష్ణ, రాంచంద్రూ వంటి అనేక మంది సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడ్డదా? బాగుపడలేదా? ఆలోచించాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌రెడ్డి, మెదక్ కాంగ్రెస్ నాయకులు నోముల ప్రకాశ్‌రావు, జగదీశ్వర్, ప్రవీణ్ లాలా తదితరులు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరితోపాటు బీఎస్పీ దేవరకొండ ఇన్చార్జి రమావత్ రమేశ్‌నాయక్, పీఏపల్లి బీఎస్పీ అధ్యక్షుడు ధర్మపురం శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎండీ షాకీర్ తదితరులు గులాబీ పార్టీలో చేరారు.