Minister KTR | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశానికి ప్రధాన శని కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆలిండియా పప్పూ రాహుల్‌గాంధీ అని, తెలంగాణ ముద్ద పప్పు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చెత్తా చెదారం అని, టీపీసీసీ అంటే తెలంగాణ పెరట్ల చెత్తా చెదారం అని కొత్త నిర్వచనం ఇచ్చారు.
తెలంగాణ కరువును తరిమికొట్టే వరం, తెలంగాణ జాతి సంపద కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి గడ్డం నాగరాజు మంత్రి కేటీఆర్ సమక్షంలో గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దున్నపోతు ఈనిందంటే దూడను గాట్ల కట్టేయమన్నట్టుగా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్, రేవంత్ వ్యవహరశైలి ఉన్నదని ఎద్దేవా చేశారు.
రెండు పప్పులు కలిసి బ్రిడ్జి మీద ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్‌ను చూపిస్తూ కాళేశ్వరం కూలిపోతున్నదని చెప్పుకొన్నారని ధ్వజమెత్తారు. ఏ బ్రిడ్జి కట్టినా మధ్యలో గ్యాప్ ఉంటుందన్న కనీసం పరిజ్ఞానం కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. ఇద్దరు మహా ఇంజినీర్లు, సన్నాసులు పోయి కాళేశ్వరం కూలిపోయిందంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలోని చిన్న లోపాలను పెద్దగా చూపించి.. బరాజ్ కొట్టుకపోయిందనటం వారి భావదారిద్య్రానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ధ్వజమెత్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక బాగుపడ్డది ఒక్క గాంధీ కుటుంబమేనని అన్నారు. రాహుల్‌గాంధీ స్క్రిప్ట్ రైటర్‌ను అయినా మార్చుకోవాలి, లేదా స్క్రిప్ట్ అయినా మార్చుకోవాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కరువు కాటకాలతో అల్లాడిపోవటానికి కాంగ్రెస్ పాలనే కారణమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు ఇచ్చి ఉంటే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు ఎందుకు వచ్చేవని రాహుల్‌గాంధీని నిలదీశారు. రాహుల్‌కు చరిత్ర తెలియదని, తెలుసుకోవాలనే సోయి కూడా లేదని ఎద్దేవా చేశారు. నెహ్రూ మొదలుపెట్టిన ఎస్సారెస్పీ నిర్మాణం నిన్నమొన్నటి దాకా నడుస్తనే ఉన్నదని, ఒక ప్రాజెక్టు కట్టడానికి 60 ఏండ్లు పట్టిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేశారని తెలిపారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసిన దౌర్భాగ్యులు కాంగ్రెస్‌వారు కాదా? అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ మొదలు పెట్టి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో వేల కోట్ల నిధులు కాజేశారని దుయ్యబట్టారు. ‘రాహుల్ పక్కన ఉన్న రేవంత్‌రెడ్డి దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్కంటే పెద్ద కిలాడీ. గతంలో ఓటుకు నోటు అమ్ముకున్నాడు. ఇప్పడు సీటుకు నోటు అమ్ముకున్నాడు. రేపు రాహుల్‌ను అమ్మినా అమ్ముతడు’ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ రూపొందించిన ప్రాణహిత చేవెళ్లలో పంపుహౌస్‌లు, కాలువలు తప్ప రిజర్వాయర్లు లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ డిజైన్ చేసిన తరువాత అనేక రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, మల్కపేట, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లు వచ్చాయని గుర్తుచేశారు.
2005లో ప్రాణహిత చేవెళ్ల అంచనా వ్యయం రూ.40 వేల కోట్లు ఉంటే, 2015 తరువాత రిజర్వాయర్లతో కలిసి రూ.80 వేల కోట్లకు చేరిందని, రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటున్న రాహుల్‌ను పప్పు అనకపోతే ఏమంటరని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు రాహుల్‌గాంధీని పప్పు అని ఎద్దేవాచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం లేకుంటే తెలంగాణ రాష్ట్రం పంజాబ్, హర్యానాను దాటి వరి ఎట్లా పండిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి తిమింగళమని, ఏ టు జడ్ కుంభకోణాలు చేసింది ఆ పార్టీయేనని ఆరోపించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలంతా తరలివస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీకి ఉన్నవి కూలగొట్టడం, శవాలున్నాయా? శివాలున్నాయా? అనటం తప్ప మరేమీ తెలియదన్నారు. ఈ ఎన్నికల్లో ఖర్చుచేసేందుకు కాంగ్రెస్‌వారికి కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయని విమర్శించారు. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు మోదీ, అమిత్‌షా, 16 మంది బీజే పీ సీఎంలు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య తదితరులంతా వస్తరట అన్నారు.
కాంగ్రెస్ లాంటి సన్నాసుల చేతి లో తెలంగాణను పెడితే మరో 50 ఏండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. బీఆర్ఎస్లో చేరిన నాగరాజు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని చెప్పారు. కార్యక్రమంలో కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామకృష్ణారావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ వేణు, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్‌సాగర్, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, దరువు ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Ktr