హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ పాపపరిహారం చేసుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుంచీ విషం చిమ్ముతున్న మోదీ, ప్రజలకు బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్లుగా నియమించకూడదని సర్కారియా కమిషన్ స్పష్టం చేసినా.. లీడర్లనే మోదీ గవర్నర్లుగా నియమించారని విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతోమాట్లాడారు. ప్రధాని మోదీకి పాలమూరులో కా లుపెట్టే నైతిక హక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్డీఏ డీఎన్ఏలోనే తెలంగాణపై వివక్ష
తెలంగాణ ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్ల తర్వాత కూడా ఇంకా కొందరికి పాత అలవాట్లు పోవడంలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్డీఏ డీఎన్ఏలోనే తెలంగాణపై వ్యతిరేకత ఉన్నదని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రధాని మొదలు గల్లీల్లోని బీజేపీ నాయకుల దాకా తెల్లారి లేస్తే రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని ఫైరయ్యారు. కొత్త పార్లమెంట్లో అమృతకాల సమావేశం అని చెప్తూనే ప్రధాని మళ్లీ తెలంగాణపై విషం చిమ్మారని ధ్వజమెత్తారు. తల్లిని చంపి బిడ్డను బతికించారనటం ప్రధాని అజ్ఞానమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లు పోరాడి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి.. మెప్పించి సాధించుకున్న రాష్ట్రం పట్ల, ఇక్కడి ప్రజల పోరాటాల పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దల పట్ల మోదీకి ఎందుకు చిన్నచూపు? అని ప్రశ్నించారు.
‘రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది సందర్భంగా ఇటీవలే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిగా యి. అయినా రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉత్సవాలే జరగలేదని మోదీ అన్నారు. పల్లె పల్లెలో.. గల్లి గల్లిలో తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకొన్న మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ పుట్టుగతుల్లేకుండా పోయినట్టే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అడ్రస్ లేకుండా పోతుంది. బీజేపీకి తెలంగాణ ప్రజల శాపం తప్పకుండా తాకుతుంది. దేశ చరిత్రలో మోదీ వంటి దుర్మార్గ ప్రధాని ఎవరూ లేరు. భవిష్యత్తులోనూ ఎవరూ రారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వటంతోపాటు తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
Ktr1
తెలంగాణ జాతికి బీజేపీ ద్రోహం
ప్రధాని మోదీకి పాలమూరులో కాలుపెట్టే నైతిక హక్కు ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరువు జిల్లాగా ముద్రపడిన మహబూబ్‌నగర్ జిల్లాకు మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘2014 జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే.. జూలై 14న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి తెలంగాణకు న్యాయం చేయాలంటే గోదావరి, కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. నీళ్ల కేటాయింపులు పూర్తయితే చాలు.. మా బతుకులు మా ర్చుకుంటామని మొరపెట్టుకున్నారు. తొమ్మిదిన్నరేం డ్లు గడుస్తున్నా ఇప్పటికీ మోదీ ఆ పని చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు అడిగినా, జాతీయ హోదా కోరినా ఇవ్వలేదు. కానీ కర్ణాటకలోని అప్పర్ భద్రకు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కెన్‌బెత్వాకు, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసం ఒక్కో రాష్ర్టానికి ఒక్కో రీతిలో బీజేపీ వ్యవహరిస్తున్నది. బీజేపీ జాతీయ పార్టీ కాదు.. తెలంగాణ జాతికి ద్రోహం చేసి, దగా చేసిన పార్టీ.
మోదీ.. ఇప్పుడైనా పాపపరిహారం చేసుకో
తెలంగాణ గడ్డమీద కాలుపెట్టే ముందే 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 575 టీఎంసీలుగా గుర్తిస్తున్నారో లేదో మోదీ స్పష్టత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణాజలాల్లో వాటా తేల్చేందుకు, ట్రిబ్యునల్‌కు ఒక ఉత్తరం రాయటానికి ప్రధానికి సమయం దొరకటం లేదా? కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం ఎందుకు అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటే సమస్యను తక్షణమే పరిష్కరిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన 575 టీఎంసీల వాటా ఎందుకు తేల్చడంలేదని నిలదీశారు. ఇవేవీ చేయకుండా పాలమూరులో అడుగుపెట్టేందుకు బీజేపీకి, మోదీకి ఇంగితం ఉన్నదా? అని ప్రశ్నించారు. మోదీ ఓట్ల వేట కోసమే వస్తున్నారనే విషయం తమకు తెలుసని, ఓట్ల యావ కాకుం డా ప్రజలకు చేసిన నాలుగు మంచిపనులు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఇప్పుడైనా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి.. మోదీ పాప పరిహారం చేసుకోవాలని సూచించారు. ‘ఖాళీ చేతులతో రావడం మోదీకి అలవాటే. అమరావతికి తట్టెడు మట్టి..చెంబెడు నీళ్లతో వెళ్లినప్పుడే ఆయన ఉత్త చేతులతో వస్తారని దేశ ప్రజలకు అర్థమైంది. తెలంగాణపై మోదీ ఎంత ప్రేమ ఒలకబోసినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా బీజేపీని, ప్రధానిని ప్రజలు నమ్మరు. ఖాళీ చేతులతో వచ్చిపోయే బీజేపీకి ఓట్ల డబ్బాల్లో కూడా గతంలో 108 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోయినట్టే.. వచ్చే ఎన్నికల్లో 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం’ అని స్పష్టంచేశారు.
Ktr
పగబట్టిన పార్టీలపై ప్రజల్లో తేల్చుకుంటాం
తెలంగాణపై మోదీ పగబట్టారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో అగ్రగామిగా ఎదిగిన రాష్ట్రంపై ప్రధాని కక్షగట్టారని విమర్శించారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు రాహుల్‌గాంధీకి, మోదీకి మాట రాదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తలసరి ఆదాయం తక్కువ ఉండి, తెలంగాణలోనే ఎందుకు ఎక్కువ ఉందంటే ఈ రెండు పార్టీలకు నోటిమాట రాదని ఎద్దేవా చేశారు. తెలంగాణపై పగబట్టిన రెండు పార్టీలతో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని సవాల్ చేశారు.
అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
దేశప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ జమిలి ఎన్నికల నినాదాన్ని ముందుకు తెచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ అదే చేస్తున్నారని ఆరోపించారు. ‘అత్యధిక నిరుద్యోగి రేటు, అత్యధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం.. ఇలా అనేక రంగాల్లో మోదీ తన అసమర్థతను చాటుకున్నారు. 2022 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానన్నారు. 2022 నాటికి ప్రతీ ఒక్కరికి పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇందులో ఏ ఒక్కదాన్నీ నిజం చేయని అసమర్థ ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే మోదీ అసమర్థ విధానాలతో నైపుణ్యంగల యువత విదేశాలకు వెళ్లిపోతున్నది’ అని కేటీఆర్ అన్నారు. దేశ హితం కోసం కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ర్టాలు అన్యాయానికి గురైతే ఊరుకోబోమని హెచ్చరించారు. నియోజకవర్గాల పునిర్వభజన విషయంలో జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకొంటే దక్షిణ భారతానికి తీవ్ర నష్టం వాటిళ్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్
ఇంట్లోనే చికిత్స అందిస్తున్న వైద్య బృందం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది : కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ వైరల్ జ్వరం, దగ్గుతో వారం రోజుల నుంచి బాధపడుతున్నారు. ప్ర త్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తున్నది. కొద్ది రోజుల్లోనే సీఎం జ్వ రం, దగ్గు నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంగా తయారవుతారని వైద్యులు చెప్పినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో మంగళవారం తెలిపారు.