హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశంలో కుల, మతాల ప్రాతిపదికన మనుషులను విడదీసిన ఘనత కాంగ్రెస్, బీజేపీలకే దక్కుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన గాడ్సే దూరాడని, ‘ఒక్కసారి’ అధికారం పేరిట మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆ రెండు పార్టీలే దేశంలో మత రాజకీయాలు చేశాయని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా దేశంలోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నానికి బీజేపీ పూనుకున్నదని వ్యాఖ్యానించారు.
సోమవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన మైనార్టీ నేతలు షేక్ అబ్దుల్ సోహైల్, అర్హమ్ ఆదిల్ బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సర్వమతాల అభ్యున్నతికి పాటుపడుతూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని చెప్పారు.
వారిని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయని, ఈ ఎన్నికల్లో మతాల ప్రాతిపదికన ప్రజలను విడదీసి ఓట్లు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నెహ్రూ నుంచి సోనియాగాంధీ వరకు కాంగ్రెస్, బీజేపీ మాతృక అయినా ఆర్ఎస్ఎస్కు చెందిన బాబూరాజేంద్రప్రసాద్, శ్యాంప్రసాద్ ముఖర్జీ వంటి నేతలతో కలిసి పాలన చేసిన విషయాన్ని నేటితరం ముస్లిం యువత గుర్తు చేసుకోవాలని సూచించారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించేలా బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ముస్లిం, క్రిస్టియన్లను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఆ రెండు పార్టీలు చూశాయని విమర్శించారు.
కుల, మతాలకు అతీతంగా పథకాలు
మైనార్టీలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపులు లేవని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఏటా రూ.1,200 కోట్ల నిధులతో మైనార్టీలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. కుల, మతాలకు అతీతంగా షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో పథకాలను అందరికీ అందిస్తున్నామని వెల్లడించారు. గాంధీభవన్‌లో దూరిన రేవంత్ లాంటి గాడ్సేతో తెలంగాణలో మతాలవారీగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎప్పుడూ బీజేపీకి బీ టీం కాదని, కేవలం తాము పేదోడి పక్షాన నిలిచే నిఖార్సైన లౌకికవాది కేసీఆర్ నాయకత్వంలో పాలన చేస్తున్నామన్నారు. మైనార్టీల ఓట్ల కోసం బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గ్రహించాలని సూచించారు. తెలంగాణ తరహాలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలుకావడంలేదని చెప్పారు. ఇన్నాళ్లూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో రెండు మాత్రమే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను 204కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు. విద్యాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా మైనార్టీల కోసం వందల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని వివరించారు.