హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీజేపీ పాలనలో దేశమంతటా బీసీలకు మిగిలింది వేదన, అరణ్య రోదన అని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. నిన్నటిదాకా మత రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు కుల రాజకీయాలకు తెర తీసిందని మండిపడ్డారు. బీసీల జనగణన కూడా చేయని పాలన మోదీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వశాఖను కూడా పెట్టలేదని ధ్వజమెత్తారు. బీజేపీ ముమ్మాటికీ బీసీల వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యానించారు. బీసీలంటే బీజేపీ దృష్టిలో బలహీనవర్గాలని, కానీ తమకు బీసీలంటే బలమైన వర్గాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీసీలకు పదవులే కాదు.. వారికి అనేక పథకాలిచ్చిన ప్రభుత్వం తమదని స్పష్టంచేశారు. ‘బీసీ జనగణన చేయరు. బీసీ మంత్రిత్వశాఖ పెట్టరు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీని తీసేస్తారు. కానీ ఇవాళ బీసీ సీఎం అంటరు. ఇలాంటి నినాదాలు, ఆలోచనలను ప్రజలు నమ్మరు’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణ మాఫీ చేయలేదని, అలాంటి మోదీ.. రెండుసార్లు రుణమాఫీ చేసిన తమ సర్కారుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు.
తనకు దేవుడిపై నమ్మకం ఉందని, అయితే దేవుడిని రాజకీయం కోసం వాడుకునే హిందువును కాదని చెప్పారు. మతం, హిందుత్వతో చిచ్చు పెట్టే విధానం తనది కాదని అన్నారు. ఇతర మతాలను కించపర్చనని, చర్చి, మసీదు అన్నింటికీ మొక్కుతానని తెలిపారు. ఓ టీవీ చానల్లో నిర్వహించిన క్వశ్చన్ అవర్‌లో కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధాని మోకి తల వంచం, తల దించమని స్పష్టంచేశారు. మోదీది ఎవరినైనా లొంగదీసుకుంటామనే మనస్తత్వమని చెప్పారు. మోదీ భయపెట్టే ప్రయత్నం చేసినా బెదిరేదిలేదు, అదిరేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎత్తిపోయిందని అన్నారు.
ఒంటరిగానే ప్రభుత్వం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించి, ఆ తరువాత ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. గతంలో రెండు పర్యాయాలు ఒంటరిగానే గెలిచామని, మళ్లీ ఒంటరిగానే గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ మూడో సారే కాదు.. ఆయన జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో పెట్టాల్నా లేక కేసీఆర్ చేతిలో పెట్టాల్నా అన్నది ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
డబ్బులతో దొరికిన థర్డ్‌రేట్ క్రిమినల్‌కు పీసీసీ అధ్యక్షపదవిని అప్పగించడం తప్పుకాదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అందరినీ కలవడంలేదన్న ప్రశ్నకు.. కొందరు మేధావులు, పెద్దలకు మాత్రమే సీఎం కేసీఆర్ కలవరన్న ఆలోచనలున్నాయని, పైరవీకారులకు మాత్రమే ముఖ్యమంత్రులను కలవాల్సిన అవసరముంటుందని, అలాంటి వారిని కేసీఆర్ కలవరని చెప్పారు. కేసీఆర్ అహంకారి, నియంత అయితే రేవంత్‌రెడ్డి ఆయనను నోటికొచ్చినట్టు బూతులు తిట్టేవారా? ఈ రోజు బయట తిరిగేవారా?’ అని ప్రశ్నించారు.
2024లో మహారాష్ట్రలో పోటీ
తెలంగాణ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో పని మొదలుపెడుతామని కేటీఆర్ చెప్పారు. 2024లో మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బీజీగా ఉండటంతోనే ఇతర రాష్ర్టాల ఎన్నికల్లో పోటీ చేయడంలేదన్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరుతారని అన్నారు.
లక్ష కోట్ల ఆస్తులు నిరూపించినోళ్లకే ఇచ్చేస్తా
తనకు లక్ష కోట్ల ఆస్తులున్నాయని నిరూపిస్తే.. వారికే ఆ ఆస్తులు ఇచ్చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లలో ఉంటాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చేనాటికి తన నెల జీతమే రూ. 2.5 లక్షలని, స్వరాష్ట్రం కోసం దాన్ని వదులుకొని ఉద్యమంలోకి వచ్చానని వివరించారు.
బడ్జెట్ మేరకే మ్యానిఫెస్టో
రాష్ట్ర బడ్జెట్‌ను లెక్క వేసుకొనే మ్యానిఫెస్టోను రూపొందించామని కేటీఆర్ చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాల మొత్తాన్ని పెంచుకుంటూ పోతామని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని, ఇవ్వని హామీలు కూడా అమలు చేశామని చెప్పారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఆరు కిలోల బియ్యం, 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పారని, వాటిని అమలు చేయలేదన్నారు.