Minister KTR |హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈది నట్టేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. ఎన్ని వాగ్దానాలు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మేవారు ఎవరూ లేరని చెప్పారు. గురువారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భద్రాచలం నియోజకవర్గానికి చెందిన తెల్లం వెంకట్రావ్, దుమ్ముగూడెం జడ్పీటీసీ సీతాదేవి తదితరులకు ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తాతా మధు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం డీసీసీబీ అధ్యక్షుడు కూరాకుల నాగభూషణం, బొమ్మెర రామ్మూర్తి, లింగంపల్లి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెసోళ్లు మనకు కొత్తనా? వాళ్లు నిన్నగాక మొన్ననే ఆకాశం మీది నుంచి ఊడిపడ్డట్టు ఒక్క అవకావం ఇవ్వండి అని అడుగుతుంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 55 ఏండ్లపాటు పది పదకొండుసార్లు అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. రూ.200కు మించి పింఛన్ ఇవ్వనివాళ్లు నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేస్తుంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. ‘ఎంతోకాలంగా పోడు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు 4.5 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చాం..ఇక్కడ పెద్దపెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ నేతలు ఛత్తీస్‌గఢ్‌లోని అడవిబిడ్డలకు పోడుభూములు ఎందుకు ఇవ్వలేదు? రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నదా? తెలంగాణలో మాదిరిగా ఛత్తీస్‌గఢ్‌లో రైతులు పండించిన మొత్తం పంటను ఎందుకు కొనడం లేదు? ఏమి చూసి కాంగ్రెస్‌ను ఆదరించాలి?’ అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
4 వేలు.. 40 వేలంటారు.. నమ్మేదెవరు?
60 ఏండ్లు అధికారంలో ఉండి రూ.200 మాత్రమే పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇవాళ రూ.నాలుగు వేలు ఇస్తామని చెప్తున్నారని, రేపు రూ.40 వేలు ఇస్తామని చెప్పినా ఆశ్చర్యం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మనం 24 గంటల కరెంటు ఇస్తుంటే వాళ్లు 25 గంటలు ఇస్తామని చెప్తారని ఎద్దేవా చేశారు. రైతులకు మూడు గంటల చాలంటూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ మనసులో మాటను బయటపెట్టారని గుర్తుచేశారు. రైతుబంధు, 24 గంటల కరెంటు, మిషన్‌భగీరథ నీళ్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్ ఇలా అన్నీ పొందుతూనే కేసీఆర్‌ను తిట్టడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు.
కుమ్రంభీం కల నెరవేర్చిన కేసీఆర్
జల్.. జంగల్.. జమీన్ నినాదం స్ఫూర్తితో నాటి పాలకులపై తమ జాతి కోసం పోరాటం చేసిన కుమ్రంభీం కలను మన ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని కేటీఆర్ చెప్పారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్, భద్రాచలం నుంచి నారాయణఖేడ్ వరకు పచ్చనిపొలాలతో భూమాత ఆకుపచ్చని చీర కట్టుకున్నదా? అన్నంత గొప్పగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. దేశమంతటా అడవులు నాశనం అవుతుంటే.. తెలంగాణకు హరితహారం ద్వారా కొత్తగా 5.13 లక్షల ఎకరాల్లో అడవిని సృష్టించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
భద్రాద్రి రామాలయాన్ని పునర్నిర్మించేది కేసీఆరే
యాదగిరిగుట్ట మాదిరిగానే భద్రాద్రి రామాలయాన్ని సైతం సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దుతారని కేటీఆర్ పేర్కొన్నారు. భద్రాద్రిలో శాశ్వత వరద నివారణకు గోదావరికి కరకట్టలు కట్టాల్సిన బాధ్యత తమపైనే ఉన్నదని, సంకల్పబలం ఉన్న కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. భద్రాద్రి థర్మల్ పవర్ విస్తరణ జరిగి తీరుతుందని, రాష్ట్రంలోనే బెస్ట్ కలెక్టరేట్, బెస్ట్ మెడికల్ కాలేజీ భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉన్నదని పేర్కొన్నారు.
అభివృద్ధి ప్రదాతకు అండగా ఉందాం: పువ్వాడ అజయ్‌కుమార్
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లా నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించినా సీఎం కేసీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో పదికి పది సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.
Ktr
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష: రేగా కాంతారావు
దేశంలో మరే పార్టీకి లేని సుగుణాలు బీఆర్ఎస్కు ఉన్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే పార్టీకి, రాష్ర్టానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరేమి చేసినా, ఎన్ని కుట్రలు చేసినా మూడోసారి ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు.
నక్సలైట్లు, కమ్యూనిస్టులు కోరుకున్నవన్నీ కేసీఆర్ చేశారు
నక్సలైట్లు, కమ్యూనిస్టులు కోరుకునే సమసమాజ స్థాపన, పేదరిక నిర్మూలన వంటవన్నీ కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో హన్మంతుడులేని గుడిలేదు. సంక్షేమ పథకం అందని ఇళ్లు లేదని పేర్కొన్నారు. దళితబంధు, బీసీబంధు, మైనారిటీబంధు, గిరిజనులకు పోడుభూముల పంపిణీ, సమాజంలో ఆసరా అవసరమైన అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. అన్ని వర్గాలను అక్కున చేర్చుకున్న కేసీఆరే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని తెలిపారు. సంపదను సృష్టించి, దానిని తిరిగి పేదలకే పంచుతున్న ఒకే రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన నాడు భూముల ధర ఎంత? ఈరోజు ఎంత? రాష్ట్రంలో సంపద పెరిగిందా? తగ్గిందా? ప్రతి ఊళ్లో కొత్త ఇండ్లు కడుతున్నారా? లేదా? అని ఆలోచించాలని కోరారు.
ప్రతి సీటులో గులాబీ జెండా
‘ఎవరేం మొరిగినా మళ్లీ వచ్చేది మనమే. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రతి అసెంబ్లీ సీటులో గులాబీ జెండా ఎగురేద్దామని పిలుపునిచ్చారు. ‘ఎన్నికలు రాగానే కొందరు డబ్బులు ఇస్తరు. వాటిని ఏం చేస్తరో అది జేయండి. ఓటు కేసీఆర్‌కే వేయండి’ అని కోరారు. కేంద్రంలో కూడా బీఆర్ఎస్ లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని చెప్పారు. ‘కేసీఆర్‌కు మహారాష్ట్రలో అపారమైన ఆదరణ వస్తున్నది. రోజుకొక పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవుతున్నది’ అని వివరించారు. రాష్ట్రంలో ఇచ్చే తీర్పు దేశం యావత్తు ప్రతిధ్వనించాలని అభిలషించారు. జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైన ప్రబలశక్తిగా తెలంగాణ ప్రజాశక్తిని మలచే ప్రయత్నంలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా 17కు 17 ఎంపీ స్థానాలు కూడా గెలిచేవిధంగా కార్యాచరణ ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈది నట్టేనన్న గ్రహింపుతోనే వెంకట్రావ్ బీఆర్ఎస్లో చేరారని, పార్టీలో చేరిన వారి భవిష్యత్తు, భరోసాకు తమదే బాధ్యత అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఇవి నిజాలా? అబద్ధాలా?