మేం రెండు వేల పింఛన్ ఇస్తే.. మీరు నాలుగువేలు కలిపి ఆరు వేలు ఇచ్చి దేశంలో పేదల మనసు గెలుచుకోవాలి. మేం దళితబంధు పది లక్షలు ఇస్తుంటే ఇంకో పది లక్షలు మీరు కలిపి ఇచ్చి దళితుల మనసు గెలుచుకోవాలి. అంతే తప్ప, ఇది మాదే.. అది మాదే అనే పనికి మాలిన మాటలతో కడుపు నిండదు.
– మంత్రి కేటీఆర్
కరీంనగర్, మార్చి 17 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా తెచ్చారా? అని నిలదీశారు. గత ఏడేండ్లలో ప్రజలకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వెయ్యి పనులను చెప్తానని.. ఎంపీగా ఆయనగానీ, కేంద్రం కానీ ఏం చేసిందో చెప్పాలని సవాలు విసిరారు. గురువారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు మంత్రి గంగుల కమలాకర్ భారీ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. వెయ్యి కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక మార్క్‌ఫెడ్ మైదానంలో, ఆ తరువాత చొప్పదండిలో జరిగిన బహిరంగసభల్లో మాట్లాడుతూ బండి సంజయ్‌పై నిప్పులు చెరిగారు. ‘రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ కోరుకొంటున్నారని చెప్తున్నావు కదా.. అలాంటప్పుడు కరీంనగర్లో నువ్వు, ఢిల్లీలో మోదీ ఉన్నారు కదా? దీంతోపాటు నువ్వు గొప్ప నాయకుడివి కదా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడివి కదా? మార్కెట్లో నీకు బాగా గిరాకీ ఉంది కదా? ఢిల్లీలో నీకు బాగా పతార ఉన్నది కదా? మరి కరీంనగర్లో గడిచిన మూడేండ్లలో ఏం చేశావో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కరీంనగర్‌కు ఒక మెడికల్ కాలేజీ కానీ, కాళేశ్వరానికి జాతీయ హోదా కానీ, నేత కార్మికులకు మెగా పవర్లూమ్ క్లస్టర్ కానీ, చేనేత సమూహాలు కానీ, నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం కానీ తెచ్చారా? అని ప్రశ్నలు గుప్పించారు. నేదునూరులో రైతులనుంచి కేంద్రం స్థలం తీసుకొని మొండిచెయ్యి చూపించిందన్నారు. హుజూరాబాద్, జమ్మికుంటల్లో నేత కార్మికులు అడుగుతున్న చేనేత సమూహాలు కూడా తేలేకపోయాడని బండిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
దమ్ముంటే గంగుల మీద గెలువు
బీజేపీ నేతలవన్నీ డొల్ల మాటలేనని,కేంద్ర మంత్రులు సైతం అసమర్థులని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీచేసి గంగుల చేతిలో ఓడిపోయిన బండి సంజయ్ అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఎంపీగా గెలిచారన్నారు. ‘ఆనాడు ఏదో గాడ్పు వల్ల ఎంపీగా గెలిచి, తంతే గారెల బుట్టలో పడ్డట్టు రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నడు. దీనికే ఆయన ఆగుతలేడు.. దమ్ముంటే కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీద పోటీ చేసి గెలిచి చూపించు. కరీంనగర్ వేదికగా సవాల్ విసురుతున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే.. నేడు వెయ్యి పనులు చెప్పగలుగుతా? వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కొట్లాడి కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకువచ్చారు. బండి సంజయ్‌ను అడుగుతున్నా.. నువ్వు గెలిచి మూడేండ్లు అవుతున్నది. కరీంనగర్ కోసం రూ.3 కోట్ల పనైనా చేశావా? అని ప్రశ్నించారు. నేతన్నలు ఎనిమిదేళ్లుగా మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని అడుగుతున్నారు. కేంద్రం మొండి చెయ్యి చూపించిందే తప్ప ఏమీ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మేడిగడ్డ నుంచి ఎస్సారెస్పీ, లోయర్ మానేరు డ్యాం, మధ్య మానేరు, అప్పర్ మానేరు నింపడంతో పాటు పూర్వ కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాం. ఇంత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కనీసం ఒక్కసారైనా పార్లమెంట్లో నోరు విప్పి అడిగావా? ట్రిపుల్ ఐటీ కానీ, ఐఐటీ కానీ, కనీసం పాలిటెక్నిక్ గానీ తెచ్చావా?’ అని ప్రశ్నించారు.
వెంకన్న గుడికి ఏం చేశావు?
తెల్లారి లేస్తే డబ్బాలో రాళ్లేసి ఊపినట్టుగా హిందూ ముస్లిం అంటూ ఒకటే లొల్లి పెడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హిందూ అని మాట్లాడినా.. కనీసం ఒక్క గుడి అయినా తీసుకొచ్చావా? అని అడిగారు చివరకు వేంకటేశ్వరస్వామి గుడి కోసం పట్టుబట్టి పదెకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఘనత మంత్రి గంగుల కమలాకర్‌కు దక్కుతుందని చెప్పారు. బండికేం చేతకాదని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ను తిట్టడం, విషం చిమ్మడం, పనికిమాలిన మాటలు మాట్లాడటం తప్ప బండి దగ్గర విషయం లేదని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఏ ఎన్నికలూ లేవు. ఎందుకు గలీజు మాటలు మాట్లాడుడు.. తెల్లారి లేస్తే ఎందుకు తిట్టుకునుడు.. పని చేద్దాం’ అని సూచించారు. తమది చిన్న ప్రభుత్వమని, తాము రూపాయి తెస్తే పెద్ద ప్రభుత్వమైన కేంద్రం నుంచి రూ.నాలుగు తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలని హితవు చెప్పారు. ‘మేంరెండు వేల పింఛన్ ఇస్తే.. మీరు నాలుగువేలు కలిపి ఆరు వేలు ఇచ్చి పేదల మనసు గెలుచుకోవాలి. మేం దళితబంధు పది లక్షలు ఇస్తుంటే ఇంకో పది లక్షలు మీరు కలిపి ఇచ్చి దళితుల మనసు గెలుచుకోవాలి’ అని సూచించారు. ‘అంతే తప్ప, ఇది మాదే.. అది మాదే అంటూ పనికి మాలిన మాటలు, కోటలు మాట్లాడడం వల్ల కడుపు నిండదు. అందుకే యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజల మధ్యలో ఉంటూ అందరికీ ఒక అన్నలా.. తమ్ముడిలా అందుబాటులో ఉండే మంత్రి గంగుల కమలాకర్‌ను లక్ష మెజార్టీతో గెలిపించి తిరుగులేని విధంగా మరోసారి అసెంబ్లీకి పంపించాలి’ అని పిలుపునిచ్చారు. రాబోయే 6 నుంచి 9 నెలల్లో 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి.. నిరుద్యోగ యువతీ యువకులు రాబోయే రోజుల్లో ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలని సూచించారు.
సీఎం దృష్టిలో కరీంనగర్ ఒక లక్ష్మీనగరం
కరీంనగర్ ముఖ్యమంత్రి దృష్టిలో లక్ష్మికి నిలయమైన గడ్డ అని.. ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా అమలవుతుందని కేటీఆర్ తెలిపారు. ‘వచ్చే ఏడాది నుంచి కరీంనగర్లో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుంది. తర్వాత ఎక్కడో ఉక్రెయిన్కో, ఫిలిప్పీన్స్కో, చైనాకో, ఇంకో దేశానికో వెళ్లి మెడిసిన్ చదువుకొనే అవసరం రాదు’ అని తెలిపారు. రూ.410 కోట్లతో గురువారం శంకుస్థాపన చేసిన మానేరురివర్ ఫ్రంట్ పనులు శరవేగంగా పూర్తిచేస్తామని, వచ్చే బతుకమ్మ సంబురాలు అక్కడే జరిపేలా పనులు చేసి చూపిస్తామన్నారు. 57 ఏండ్లకే పెన్షన్లను మే, జూన్ నెల నుంచి ఇస్తామన్నారు. ఈ సభల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
దిక్కులేక సంజయ్‌ని అధ్యక్షుణ్ణి చేశారు
కరీంనగర్ ప్రజలు ఎంపీగా ఓ పిచ్చోణ్ణి ఎన్నుకొన్నామని అనుకొంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి దిక్కులేక ఈయనను రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేశారని హైదరాబాద్ ప్రజలు జోకులు వేసుకుంటున్నారని చెప్పారు. ‘ఆదిలాబాద్‌లో ట్రైబల్ వర్సిటీ తీసుకువస్తానని అక్కడ గెలిచిన బీజేపీ ఎంపీ చెప్పారు. నిజామాబాద్ ఎంపీ మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎవరు ఏం తెచ్చింది లేదు. పసుపు బోర్డు తీసుకొస్తానని, లేకపోతే జాడిచ్చి తన్నువన్నడు.. ఇప్పటి వరకు పత్తా లేడు. ఇగ కరీంనగర్ ఎంపీ దేశం కోసం, ధర్మం కోసం అంటాడు.. ప్రధాని మోదీ కాశీలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశారని చెప్తున్నారు. చిన్న మోదీవని చెప్పుకునే నీవు దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధి కోసం ఓ వంద కోట్లు తీసుకురాలేవా? నువ్వు హిందువు కాదా? కిషన్‌రెడ్డి పేరుకే కేంద్రమంత్రి కానీ, ఏమీ తెల్వని నిస్సహాయ మంత్రి. హైదరాబాద్‌లో వరదలు వస్తే వేలమంది ఇబ్బందిపడ్డరు. ప్రతి ఇంటికి పదివేల చొప్పున రూ.660 కోట్లు అందించాం. కేంద్రం నుంచి పైసా తేలేదు. చాతకాని నలుగురు దద్దమ్మ ఎంపీలు ఉన్నరు, ఎప్పటీకీ ప్రజలు మోసపోరు.. ఏదో ఒకసారి మాత్రమే మోసపోతరు. ఏం అభివృద్ధి చేశావని నిలదీస్తే మళ్లీ గదే మత పిచ్చి మాటలు తప్ప వేరే విషయం ఏం చెప్పలేదు. అన్నీ బోగస్ డ్రామాలే. సబ్కా సాత్.. సబ్ కా వికాస్ అంటారు. కానీ, సబ్ కుచ్ బోగస్.. సబ్ కుచ్ బక్వాస్.. ఏం లేదు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తప్ప దక్షిణ భారతదేశంలో ఎక్కడా అది కనిపించకుండా పోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి సాగుతున్నది. మనకు కులం, మత పిచ్చి లేదని అందరూ మనవారేనంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. పేదవారినందరినీ సమానంగా చూసుకునే ముందుకు సాగుతున్నం.’ అని చెప్పారు.
ప్రతిపక్షాలవి దుర్మార్గమైన మాటలు: వినోద్‌కుమార్
ప్రతిపక్ష నాయకులు దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారని, వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల విమర్శలు సహేతుకంగా ఉండాలే తప్ప కక్షపూరితంగా ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉండటం మంచిది కాదని చెప్పారు. అభివృద్ధి పనులు చేస్తున్నది ఎవరో.. విషం కక్కతున్నది ఎవరో నిశితంగా పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్: గంగుల కమలాకర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు దైవం అయితే.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ పుట్టిన గడ్డపై తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పిన మంత్రి.. కరీంనగర్ జిల్లాకు మానేరు రివర్‌ఫ్రంట్, మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి గుడి నిర్మాణం కోసం 10.2 ఎకరాల స్థలాన్ని సీఎం కేటాయించారన్నారు.