తెలంగాణ వరిధాన్యం కొనాలని తమ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంత విన్నవించినా కేంద్రం ఒప్పుకోలేదని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదనే విషయం తెలుసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టిమరీ రైతులు వరి వేయొద్దని సూచించారన్నారు. ప్రత్యామ్యాయ పంటలవైపు మళ్లాలని రైతులకు చెప్పారన్నారు. కానీ బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ సర్కారుకు, వ్యవసాయశాఖ మంత్రికి ఏమీ తెలియదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని చెప్పారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టి వరివేయించాడని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా తాను ఒప్పిస్తామని బండి సంజయ్ మాట్లాడారని, ముఖ్యమంత్రిని పట్టించుకోవద్దని రైతులకు సూచించాడని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజా కొనే బాధ్యత తమదేనని బండి సంజయ్ హామీ ఇచ్చారన్నారు. మూడు సందర్భాల్లో బండి సంజయ్ మాట్లాడిన వీడియోలను మంత్రి కేటీఆర్ మీడియా ముందుంచారు. బండి సంజయ్ మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో తమకు తెలియదన్నారు. ఆయన మెంటల్ కండిషన్‌పై తమకు అనుమానాలున్నాయని చురకలంటించారు.
అలాగే, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రైతులను కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది భారత సర్కారు ఆనవాయితీగా ధాన్యం కొంటదని చెప్పారన్నాను. రా రైస్, పారా బాయిల్డ్ రైస్.. ఏదైనా కేంద్ర ప్రభుత్వమే కొంటదని రైతులకు భరోసా ఇచ్చారన్నారు. తెలంగాణ సర్కారుకే కేంద్రం చెప్పింది అర్థంకాలేదన్నట్లు కిషన్‌రెడ్డి మాట్లాడారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. కిషన్‌రెడ్డి మాట్లాడిన వీడియోను కూడా మీడియా ముందుంచారు. వీళ్ల మాటలు విని కొంతమంది రైతులు వరి వేశారని, మరి వాటిని ఎవరు కొనుగోలు చేయాలో బండి సంజయ్, కిషన్‌రెడ్డే చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.