Minister KTR | జనంలో ఉండే ఎమ్మెల్యే కావాల్నా.. జైలుకు పోయే దొంగ కావాల్నా అని కొడంగల్ ప్రజలను మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. మీకు ఏం కావాలి? ఎవరు కావాలి? అనేది డిసైడ్ చేసుకోవాలని కొడంగల్ ఆడబిడ్డలు, అన్నదమ్ముల్ని కోరారు. కొడంగల్ రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత 55 ఏండ్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినా కొడంగల్‌లో ఎన్నడూ జరగని అభివృద్ధిని.. ఈ ఐదేండ్లలో పట్నం నరేందర్ రెడ్డి చేసి చూపెట్టారని తెలిపారు. కొడంగల్‌కు డిగ్రీ కాలేజీకి తీసుకొచ్చింది నరేందర్ రెడ్డి. దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీ తెచ్చింది నరేందర్ రెడ్డి. కొడంగల్‌లో, కోస్గిలో, మద్దూర్‌లో 50 పడకల ఆస్పత్రి, ఇంకొక 50 పడకల ఆస్పత్రి, 30 పడకల ఆస్పత్రి తెచ్చింది నరేందర్ రెడ్డి’ అని అన్నారు.
రేవంత్ రెడ్డి ఎగురుడు, దుంకుడుకు ఎక్కువ రోజులు పట్టదని.. తొందరలోనే మళ్లీ చిప్పకూడు తింటాడని కేటీఆర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అవుతా అని ఆయన కలలు కంటున్నాడని అన్నారు. పిల్ల దొరికిందో లేదో ముహూర్తం పెట్టుకున్నట్టు.. ఇంకా పిల్ల దొరక్కుండానే డిసెంబర్ 9 అని ముహూర్తం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ తొమ్మిదో.. పదో ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చిల్లరగాడు.. 20 ఏండ్ల కింద సున్నాలు వేసుకునేటోడు. వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. గోడల మీద సున్నాలు వేసుకునేటోడికి ఇవాళ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘బ్లాక్మెయిల్ చేయాలి, రియల్ ఎస్టేట్ దందాలు చేయాలి. వాళ్లను బెదిరించాలి. వీడిని బెదిరించాలి. సెటిల్మెంట్లు చేయాలి. ఏదో ఒకటి చేసి నాలుగు పైసలు సంపాదించాలి.’ అనేది రేవంత్ నైజమని వివరించారు. రేవంత్ రెడ్డి నమ్ముకున్నది ప్రజలను అని.. దాంతోనే సర్పంచ్‌లను కొంటున్నడు.. ఎంపీటీసీలను కొంటున్నడు.. లీడర్లను కొంటున్నడని తెలిపారు. రేవంత్ రెడ్డి.. నువ్వు లీడర్లను కొంటున్నావ్ కావచ్చు కానీ.. కొడంగల్ ప్రజలను కొనలేవని స్పష్టం చేశారు. నీకు అంత సినిమా లేవన్నారు.
కొడంగల్ ప్రజలను కొంటానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని.. వాళ్లను అంగడి సరుకు అనుకుంటున్నాడని కేటీఆర్ తెలిపారు. ‘ కాంగ్రెసోళ్లు సాటుకు వస్తరు. రాత్రి 10 తర్వాత వచ్చి మామా అంటరు. అల్లుడు అంటరు. బావ అంటరు.. బామ్మర్ది అంటరు. బాబాయ్ అంటరు. ముదిరాజ్ సోదరుల దగ్గరికి పోతరు. అన్న.. నాకే ఓటేస్తా అని ప్రమాణం చేయమని అడుగుతరు. చేతుల ఇన్ని పైసలు పెడతరు. గౌడ సోదరుల దగ్గరికి పోయి.. అన్న ఎల్లమ్మ మీద ప్రమాణం చేయి అని అంటరు. తాండల్లో గిరిజన అన్మదమ్ముల దగ్గరికి వచ్చి నాకే ఓటేయ్యి అని సేవాలాల్ మీద ప్రమాణం చేయంటరు. ‘ అని అన్నారు. అలాంటప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలని.. ముళ్లును ముళ్లుతోనే తీయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డికి డబ్బులు ఎక్కువై.. బాగా బలిసికొట్టుకుండు అని.. అందుకే కాంగ్రెసోళ్లు పైసలిస్తే బరాబర్ తీసుకోవాలని సూచించారు. ‘వాళ్ల దగ్గర పైసలు తీసుకున్న తర్వాత ప్రమాణం చేయమంటే.. చెయ్యి చాపి.. కండ్లు మూసుకుని మనసులో తుపాల్ తుపాల్ తుపాల్ అని అనుకోవాలి. బయటకు యాక్టింగ్ చేయాలి.’ అన్నారు. బయటకు యాక్టింగ్ చేసి కారు గుర్తుకే ఓటు గుద్దాలని అన్నారు.