హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కిషన్ రెడ్డికి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచడం, ప్యాసింజర్ లిఫ్టులు ప్రారంభించడం కాదని కిషన్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై కిషన్రెడ్డిది కళ్లుండి చూడలేని పరిస్థితి అని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడక పరువు తీసుకున్నారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనూ జరిగిన అభివృద్ధిని చూడలేని స్థితి. హైదరాబాద్కు కేంద్రం అదనంగా నయాపైసా సాయం లేదు అని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాని నిస్సహాయ మంత్రి కిషన్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు అనుగుణంగా నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజా రవాణా మెరుగునకు ఎస్ఆర్డీపీ కింద రూ. 5660.57 కోట్ల విలువైన పనులు చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరద ముంపు లేకుండా రూ. 985.45 కోట్లతో ఎస్ఎన్డీపీ ద్వారా పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 735 కోట్లతో 35 పనులు చేపట్టామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.