KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎవరికి బీ టీమ్ కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మాట్లాడిన రాహుల్ గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీజేపీకి బీ టీమ్ అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.. మేం బీజేపీ బీ టీమ్ కాదు.. మీరు ఈ దేశానికి సీ టీమ్. సీ టీమ్ అంటే ఏంది.. చోర్ టీమ్ మీరు.. చోర్ టీమ్ అని కేటీఆర్ విమర్శించారు. ఏ టు జడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ అంటే కామన్వెల్త్.. ఇలా చెప్పుకుంటూ పోతే జడ్ దాకా ఉన్నాయి. ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న పార్టీ, దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఆకాశంలో ఎగిరే అగస్త్య హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కుంభకోణాల్లో స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్లకు పోయారు. ఇవాళ ఆఖరికి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ విచారణ జరుగుతోంది. మేం బీ టీమ్ కాదు.. ఈ దేశానికి మీరే సీ టీమ్. రేపటి రోజున అల్టిమేట్‌గా.. ఇక్కడ పది మంది గెలిచినా, పన్నెండు మంది గెలిచినా.. వారిని రేవంత్ రెడ్డి తీసుకెళ్లి బీజేపీలో గంపగుత్తగా చేరుతాడు. ఇవాళ రాసిపెట్టుకోండి.. మీడియా ముఖంగానే చెబుతున్నాను. రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలియదు రాహుల్ గాంధీ. రేవంత్ బీజేపీ కోవర్ట్. కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెంట్ ఆయన. బీజేపీ తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికించింది. మీకు తెలియక గాడ్సేకు గాంధీ భవన్‌ను అప్పజెప్పారని రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజమెత్తారు.