హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): అవినీతి గురించి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులే ఈడీకి ఇటీవల ఫిర్యాదు చేశారని ఆయన గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డిపై గతంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తాజాగా గద్వాల నేత విజయ్‌కుమార్ చేసిన ఫిర్యాదుల వార్తల క్లిప్పింగులను శుక్రవారం ఎక్స్‌లో మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే అడ్డంగా రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారు పార్టీలో ఉంటారని మహాత్ముడు ఆనాడే ఊహించారేమోనని విమర్శించారు. పీసీసీ అధ్యక్ష పదవిని రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి అన్నారని, ఒకరు పీసీసీ ప్రెసిడెంట్‌ను విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. అవినీతి అనేది స్కాంగ్రెస్ పేరులోనే ఉన్నదంటూ మరో పోస్టు చేశారు.