హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి దేశం కంటే ఆశ్రితుల ప్రయోజనాలే ఎక్కువ కావడం సిగ్గుచేటని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం బైలడిల్లా ఐరన్ ఓర్‌ను కేటాయించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీని నిలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోని మోదీ సర్కారు, ఆ గనులను అదానీ గ్రూప్‌కు కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా గనులను పోస్కో కంపెనీని అడ్డుపెట్టుకొని అదానీ గ్రూప్‌కు కేంద్రం కట్టబెట్టిన తీరును తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ మన్నె ట్విట్ చేయగా, దానిపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడంలేదో ఇప్పటికి తెలిసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ సర్కారు కుట్రను గొప్పగా వెలికితీశారని క్రిషాంక్ మన్నెను అభినందించారు.