Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని లక్ష మంది యువతకు ఉద్యోగాలొస్తాయనే ఆశతో నాలుగేండ్లు కష్టపడి, అనేక వేదికలపై విజ్ఞప్తి చేసి, ఎన్నో ప్రయాసలు పడి తెచ్చుకున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీని బెంగళూరుకు తరలించాలని ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈవోకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. శనివారం జలవిహార్‌లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఈ లేఖను బయటపెట్టడం సంచలనం సృష్టించింది. సీఎం కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిచ్చాం కదా.. ఒకసారి ఇంకొకరికి అవకాశమిస్తే ఏమైతుందనుకునే వాళ్లకు ఇదొక గుణపాఠం అని కేటీఆర్ అన్నారు. డీకే శివకుమార్ రాసిన లేఖను అందరికీ సర్కులేట్ చేయడంతో పాటు మీడియాకు కూడా ఇవ్వాలని సూచించారు. లేఖలోని అంశాలను కేటీఆర్ చదివి వినిపించారు.
ఫాక్స్‌కాన్ పెద్ద కంపెనీ అని, యాపిల్ ఉత్పత్తులన్నీ ఈ కంపెనీయే తయారు చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. యాపిల్ ఫోన్లు, స్పేర్ పార్ట్స్, చాలా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఆ సంస్థ ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. ఈ సంస్థ చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని వెల్లడించారు. ఇంత పెద్ద కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు చాలా శ్రమించామని తెలిపారు. దాదాపు నాలుగేండ్లు వెంటపడి మరీ ఆ సంస్థను ఒప్పించామని చెప్పారు. మా రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా, చైనా, తైవాన్ వంటి వేదికలపై పదేపదే విజ్ఞప్తి చేసి, చాలా ప్రయాసపడ్డామని గుర్తుచేశారు. ఆ శ్రమ ఫలించి ఫాక్స్‌కాన్ చైర్మన్ స్వయంగా వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి, ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ పెట్టి లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించినట్టు తెలిపారు. ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత రంగారెడ్డి కలెక్టర్ సమీపంలోనే కొంగరకలాన్‌లో 200 ఎకరాలు కూడా కేటాయించినట్టు గుర్తుచేశారు. కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించారని, ఇప్పటికే రెండంస్థుల భవనం కూడా పూర్తయింద వివరించారు.
కష్టపడి తెచ్చుకున్న ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఫాక్స్‌కాన్ సీఈవోకు డీకే శివకుమార్ రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ‘కాంగ్రెస్ వాళ్లు ఎంత దుర్మార్గులనేది ఈ లేఖ ద్వారా స్పష్టమవుతున్నది. కర్ణాటక ప్రభుత్వం తరపున డీకే శివకుమార్ లేఖ రాస్తూ… మీ ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించండి. తద్వారా పరస్పర ప్రయోజనాలుంటాయని చెప్పాడు. ఒక కంపెనీని తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం బాగానే ఉన్నది. కానీ ఆ తర్వాత రాసిందే ఆశ్చర్యమేస్తుంది. హైదరాబాద్‌లోని అనేక అంతర్జాతీయ కంపెనీలు బెంగళూరుకు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.. తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది.. అది మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్..అందుకే కంపెనీల తరలింపునకు ఆ ప్రభుత్వం సహకరిస్తుంది అని రాశారు. అంటే తెలంగాణకు కేసీఆర్ లేకపోతే ఏం జరుగుతుందనేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే’ అని కేటీఆర్ వివరించారు.
డీకే శివకుమార్ రాసిన లేఖ, దాని అంశాలను చదువుతూ… ఇదేదో భయపెట్టడానికి చెప్పడం లేదని, కేసీఆర్ లేకపోతే తెలంగాణకు ఏం జరుగుతోందో వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడి, కొట్లాడే వ్యక్తి లేకుండా పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెసోళ్లకు ఇప్పుడు బెంగళూరు కొత్త అడ్డాగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేవలం ఢిల్లీలోనే కాదు.. బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు పైసలన్నీ బెంగళూరు నుంచే తెలంగాణకు వస్తున్నాయని ఆరోపించారు. పైసలన్నీ బెంగళూరులో కార్పొరేటర్ల ఇండ్లల్లోనే దొరుకుతున్నాయని, రూ.42 కోట్లు, రూ.50 కోట్లు, రూ.90 కోట్లు ఇలా… సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సంపాదించిన పైసలన్నీ తెలంగాణకు తరలిస్తున్నారని అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్ వద్ద ఏర్పాటు కొబోతున్న ఫాక్స్‌కాన్‌ను తమ రాష్ర్టానికి తరలించుకుపోయేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులకు లేఖ రాయడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇబ్రహీంపట్నంలోనే ఫాక్స్‌కాన్ కంపెనీ ఉంటుందని తెలిపారు. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని ప్రజల సహకారంతో తిప్పికొడతామని పేర్కొన్నారు.
ఫాక్స్‌కాన్ కంపెనీని హైదరాబాద్ నుంచి కర్ణాటకకు తరలించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాయడాన్ని టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్ తప్పుబట్టారు. ఈ మేరకు క్రిశాంక్ ట్వీట్(ఎక్స్) చేశారు. డీకే శివకుమార్ తీరుతో కాంగ్రెస్ విధానమేంటో తెలిసిపోయిందని అన్నారు. రాజకీయాల్లో కాంగ్రెస్ దుర్నీతికి ఇదే నిదర్శనమని తెలిపారు.