KTR | నిజామాబాద్ : గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నికార్సయిన తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెసోళ్లు కూడా కేసీఆర్ మీద ఎగబడి ఎగబడి మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కసారి అవకాశం ఇవ్వండని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారు. వీళ్లకు ఒక్కసారి కాదు.. పది సార్లు అవకాశం ఇవ్వలేదా.? 50 ఏండ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ మనల్ని సతాయించలేదా..? 50 ఏండ్ల పాటు అధికారంలో ఉండి తాగునీరు, సాగునీరు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. ఎరువులు, విత్తనాలు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టారు. మన పట్టణాలకు నిధులు ఇవ్వకుండా సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా..? ఇవాళ వాళ్లే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఆలోచించండి. కేసీఆర్ ఈ రోడ్డు ఇట్ల ఎందుకుంది.. ఆ మోరి అట్ల ఎందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. యాభై ఏండ్లు పరిపాలించినోడో, ఏ పని చేయడానికి చేతకానోడో.. ఇవాళ మన ముందుకొచ్చి కేసీఆర్ను తిడుతుంటే పడుదామా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి.. నికార్సయిన తెలంగాణ వాది అటా..? రేవంత్ రెడ్డి నీవు తెలంగాణవాది కాదు.. నువ్వు తెలంగాణకు పట్టిన వ్యాధి. తెలంగాణకు పట్టిన జబ్బు, దరిద్రం కాంగ్రెస్ పార్టీ. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి ఆగం కావొద్దు అని కేటీఆర్ ప్రజలకు సూచించారు.