KTR | వికారాబాద్ : ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..? ప్రజలు ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇదే వికారాబాద్ నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ రాక ముందు పరిస్థితులు ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. ఆనాడు 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. నాడు ఎవరైనా ఏదైనా ఊరిలో పెద్ద మనిషి చనిపోతే కరెంటోళ్లకు ఫోన్ చేసి.. స్నానం చేయాలి కరెంట్ లేదు.. 15 నిమిషాలు కరెంట్ ఇవ్వాలని బతిమాలిడుకున్నా రోజులు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతులు భార్యాపిల్లలను వదిలేసి బావుల కాడ పండుకునుడు. కనీసం మూడు నాలుగు గంటల కరెంట్ సక్కగా రాలేదు. కేసీఆర్ హాయంలో కడుపు నిండా 24 గంటల కరెంట్ వస్తుంది. ఎక్కడున్నది కరెంట్ కనవడ్తలేదు అంటుండు రేవంత్ రెడ్డి. ఆ పెద్ద మనిషికి తెల్వదా.. కరెంట్ కనబడుతాదా..? తీగల్లో కరెంట్ ఉంటుంది. అనుమానం ఉంటే ఏ మండలానికో పోతవు పో.. మీ కాంగ్రెసోళ్లు అందరూ వరుసగా నిలబడి తీగలను గట్టిగా పట్టుకుర్రి, దేశానికి దరిద్రం పోతది. కరెంట్ గురించి కాంగ్రెసోళ్లు మాట్లాడటానికి సిగ్గుండాలి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు. 24 గంటల కరెంట్ అవసరం లేదని అంటున్నాడు రేవంత్ రెడ్డి. 10 హెచ్‌పీ మోటారు పెట్టి 3 గంటల కరెంట్ఇస్తే చాలు అంటున్నాడు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటారు ఉంటదా..? ఇంత తెలివి తక్కువోళ్లకు రాజ్యం చేతుల పెట్టల్నాటా..? తాగునీరు కోసం తండ్లాట పడ్డాం. ఎండాకాలంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎమ్మెల్యే, మంత్రులు గ్రామాల్లోకి రాలేని పరిస్థితి.. ఎందుకంటే ఆడబిడ్డలు ఎక్కడ ధర్నాలు చేస్తారో అని భయపడేటోళ్లు. ఇవాళ ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాం. కరెంట్, మంచినీళ్ల సమస్య పరిష్కారమైంది. సాగునీరు తీసుకొచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది కూడా పూర్తవుతుండే. కరోనా వల్ల ఆలస్యమైంది. దాంతో రెండేండ్లు నష్టం జరిగింది. రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం జరిగింది. పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెసోళ్లు కేసులు వేసి అడ్డుకున్నారు. మళ్లా ఇవాళ వాళ్లే వచ్చి పాలమూరు రంగారెడ్డి ఏమైందని ఎకసెక్కలు.. వాళ్లే కేసులు వేస్తున్నారు.. వారే వెటకారపు మాటలు మాట్లాడుతారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. మొన్ననే మొదటి పంపు హౌస్ మోటారును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాబోయే ఏడాదిలో వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు సమృద్ధిగా తీసుకువస్తాం. పాలమూరు ఎత్తిపోతల నీళ్లు మహబూబ్‌నగర్ వరకు వచ్చాయి. నారు పోసిన వాడే నీరు పోస్తడని అన్నట్లు వికారాబాద్ వరకు సాగునీళ్లు వస్తాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో మన వికారాబాద్‌లో జూనియర్ కాలేజీ కూడా లేకుండే. ఇప్పుడేమో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. 11 ఛాన్స్‌లు ఇచ్చాం. పెత్తనం చెలాయించారు. ప్రభుత్వం నడిపింది వారే కదా..? ఒక్క ఛాన్స్ అడుగుతున్న వారు.. 11 ఛాన్స్‌లు ఇచ్చినప్పుడు వికారాబాద్‌లో జూనియర్ కాలేజీ పెట్టలేని దద్దమ్మలకు మళ్లీ ఛాన్స్ ఇచ్చి ఆ దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకుందామా..? ఆలోచించండి అని కేటీఆర్ సూచించారు.
కరెంట్ కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా.. కరెంట్ కావాలంటే కారు గుర్తుకు ఓటేయండి.. భారతదేశంలో ఎంతో సీఎంలు, ప్రధానులు పని చేశారు. 75 ఏండ్లలో ఎవరికి ఆలోచన రాలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి ఇస్తున్నారు. రైతు అప్పుల పాలు కావొద్దని రైతుబంధు కింద ఎకరాకు 10 వేలు ఇచ్చిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్. 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు వేశారు. ఆసరా పెన్షన్లు ఇచ్చి వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులను ఆదుకున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.