హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆ రెండు పార్టీలు దేశాన్ని సర్వం దోచుకొన్నాయని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటే భ్రష్టాచార్ జనతా పార్టీ అని అభివర్ణించారు. ఆ రెండు జాతీయ పార్టీలపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ శనివారం నిప్పులు చెరిగారు. ‘మీ పార్టీలే అసమర్థ పాలనకు కేరాఫ్, అవినీతి ప్రభుత్వాలకు చిరునామా.. మీ దశాబ్దాల పాలనా వైఫల్యాల పాపమే దేశానికి, రాష్ర్టానికి శాపమై ఇంకా వెంటాడుతూనే ఉన్నది. మమ్మల్ని నేరుగా ఢీకొనే దమ్ములేక, ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే కుట్ర బీజేపీ చేస్తున్నది. బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చే కుతంత్రం కాంగ్రెస్ చేస్తున్నది. వెన్నుపోటు వారసుడిని నమ్ముకొని వెన్నుముక లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని పేర్కొన్నారు.
‘తెలంగాణ ప్రజలకు తెలుసు మేం తెలంగాణ రైతులకు రిష్తేదార్.. మేం తెలంగాణ ప్రజలకు వఫాదార్.. మా ప్రతి పథకం దిల్దార్.. మా ప్రతి నిర్ణయం ధమ్దార్ మా ముఖ్యమంత్రి ఇమాన్దార్.. మా ప్రభుత్వం పూర్తిగా జిమ్మేదార్ మా తొమ్మిదేండ్ల పరిపాలన జోర్దార్.. వచ్చే ఎన్నికల ఫలితాలు ధమాకేదార్.. దేశంలోనే తెలంగాణ మాడల్ ఆసర్దార్.. కాంగ్రెస్ అంటనేనే బేకార్.. కాంగ్రెస్ చరిత్రంతా భ్రష్టాచార్.. కాంగ్రెస్ను నమ్ముకుంటే మళ్లీ అంధకార్’.. అని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.