ఎనిమిదిన్నరేండ్లవుతున్నా రాష్ర్టానికి మోదీ ఒక్క పైసా అదనంగా ఇచ్చింది లేదు. ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదు. నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ, ఐఐఎం, ఐఐఎస్సీఆర్, ట్రిపుల్ ఐటీలు కొత్తగా మంజూరు కాలేదు. యువత ఆలోచించాలి. పేరుకేమో ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’.. మాటలేమో సబ్ బక్వాస్.-మంత్రి కేటీఆర్
నిజామాబాద్, జనవరి 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. దేశాన్ని 67 ఏండ్ల్లు పాలించిన 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే, మోదీ ఒక్కరే 2014 నుంచి ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపారని మండిపడ్డారు. దేశంలో ప్రతి పౌరుడిపైనా రూ.1.20 లక్షల అప్పుల భారం వేశారని ధ్వజమెత్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్తు వంటి భవిష్యత్తు పెట్టుబడి కోసమే అప్పు చేసి ఉత్పాదక రంగంలో పెట్టిందని, మోదీలాగా కార్పొరేట్ దోస్తులకు పంచి పెట్టలేదని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ శనివారం నిజామాబాద్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.50 కోట్లతో నిర్మించనున్న ఇందూరు కళాభారతికి శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించారు. అంతకు ముందు కాకతీయ శాండ్బాక్స్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టార్టప్ ప్రతినిధులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ దమ్ముంటే లోక్‌సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు రావాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
మోదీ ఎవరికి దేవుడు?
మోదీ దేవుడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడటంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోదీ ఏం చేసిండని ప్రజలకు దేవుడవుతారని ప్రశ్నించారు. రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1,200 చేసినందుకు ఆడ బిడ్డలకు దేవుడా? లీటర్ పెట్రోల్ రూ.70 ఉంటే, రూ.109 చేసినందుకు దేవుడా? విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఒక్క హామీని నెరవేర్చనందుకు దేవుడా? రైతుల మీద నల్ల చట్టాలు ఉసిగొల్పి యావత్ దేశానికి క్షమాపణలు చెప్పినందుకు దేవుడా? గిరిజన రిజర్వేషన్లను తొక్కి పెట్టినందుకు, చేనేతపై జీఎస్టీ విధిస్తున్నందుకు దేవుడా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారని మాట్లాడిన ఓ కేంద్ర మంత్రి చెప్పారని, మరి కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ రెండు రాష్ర్టాల మధ్య సరిహద్దు పంచాయితీని మోదీ ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రాష్ర్టాల మధ్య తగవును తెంపేందుకు చేతకాని మోదీ ఏకంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపారా? అని ఎద్దేవా చేశారు. ‘దేశంలో బెస్ట్ 20 గ్రామ పంచాయతీల్లో 19 తెలంగాణవే ఉన్నాయని వాళ్లే 26 స్వచ్ఛ అవార్డులు ఇచ్చారు. ఇలా మనకు ఢిల్లీ వాళ్లు అవార్డులు ఇస్తారు. గల్లీలో బీజేపోళ్లు తిడుతారు. వీళ్లలో ఎవరికి బుద్ధి లేదో వాళ్లే తేల్చుకోవాలి’ అని పేర్కొన్నారు.
సబ్ కుచ్ బక్వాస్
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ మోదీ ప్రభుత్వానికి చివరిదని మంత్రి కేటీఆర్ అన్నారు. 2024 ఏప్రిల్‌లో ఎన్నికలున్నందున అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెటే ఉంటుందని చెప్పారు. ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు నిధులివ్వాలని కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసినట్టు తెలిపారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తేవాలని సూచించారు. ‘ఎనిమిదిన్నరేండ్లవుతున్నా రాష్ర్టానికి మోదీ ఒక్క పైసా అదనంగా ఇచ్చింది లేదు. ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదు.
నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ, ఐఐఎం, ఐఐఎస్సీఆర్, ట్రిపుల్ ఐటీలు కొత్తగా మంజూరు కాలేదు. దీనిపై రాష్ట్రంలోని యువత ఆలోచించాలి. పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్.. మాటలేమో సబ్ కుచ్ బక్వాస్. ఏమీ ఉండదు. కొత్తగా ఇచ్చిందేమీ లేదు. చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు. కొత్త జిల్లాకు నవోదయ పాఠశాలలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వరు. నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సమర్థత, కార్యదక్షతను చూసి ఓర్వలే దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రూ.30 లక్షల కోట్ల దోపిడీ..
బీజేపీ సర్కారు చమురు ధరలు పెంచి ఎనిమిదేండ్లలో ప్రజల సొమ్ము రూ.30 లక్షల కోట్లు దోపిడీ చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.70. క్రూడాయిల్ ధర 94 డాలర్లు. ఈరోజు క్రూడాయిల్ ధర రూ.90 డాలర్లు. అయినా పెట్రోల్ ధర 119 ఉన్నది. అంటే ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్ ధరల దోపిడీ ఆగడం లేదు. దేశ ప్రజల నుంచి అమానవీయంగా రూ.30 లక్షల కోట్లను సెస్ పేరిట వసూలు చేశారు. వీళ్లకు హిందుస్థాన్, పాకిస్థాన్ తప్ప పనికొచ్చిందేమీ ఉండదు’ అని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టే డైలాగులు కొట్టుడు తప్ప అభివృద్ధి చేసే ముఖం లేదని ఏద్దేవా చేశారు.
నష్టాలను జాతీయం చేయాలి. లాభాలను అస్మదీయులకు పంచాలి అన్నట్టుగా మోదీ నీతి ఉన్నదని దుయ్యబట్టారు. ‘దేశం మొత్తం రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఏటా అయ్యే ఖర్చు రూ.1.40 లక్షల కోట్లు. రైతులకు లాభం చేయలేని బీజేపీ ప్రభుత్వం తమ కార్పొరేట్ దోస్తులకు రూ.12 లక్షల కోట్లు రుమాలు మాఫీ చేసింది. ఇది నిజమా కాదా? నేను చెప్పింది తప్పు అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని కేటీఆర్ సవాల్ చేశారు. పెద్దవాళ్లకు పెద్దపీట వేసి, పేదలను కడుపులో తంతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధును కాపీ కొట్టి మోదీ సర్కారు పీఎం కిసాన్ పథకం తెచ్చిందని అన్నారు. ఈ పథకం కింద వచ్చే బడ్జెట్లో దేశంలోని రైతులందరికీ ఎకరాకు ఒక్కో సీజన్‌కు రూ.5 వేల చొప్పు రూ.10 వేలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రం ఇచ్చే దానికి అదనంగా ఈ సొమ్ము ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు పసుపుబోర్డు ఇవ్వాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు కేటీఆర్ పరోక్షంగా చురకలంటించారు. ఆయన తండ్రి డీ శ్రీనివాస్‌పై గౌరవంతోనే తాము అర్వింద్పట్ల బూతులు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. సంస్కారహీనులుగా మిగిలిపోవద్దని హితవు పలికారు. 2014 నుంచి నిజామాబాద్ నగరంలో రూ.936.69 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.
దమ్ముంటే లోక్‌సభ రద్దు చేయండి..
రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని, అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బీజేపీ నేతలకు దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు రావాలి. అప్పుడు అందరం కలిసే ఎన్నికలకు వెళ్దాం’ అని సవాల్ విసిరారు.
మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, మహ్మద్ షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్ నీతూకిరణ్, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
సవాల్‌కు సిద్ధమా?
తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం రూ.3.68 లక్షల కోట్లు పన్నులు వసూలు చేసి, తిరిగి ఫైనాన్స్ కమిషన్ రూపంలో చట్టబద్ధంగా ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ర్టానికి పైసా అదనంగా ఇవ్వలేదని చెప్పారు. ‘మనం కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి ఇస్తుంటే వాపస్ వస్తున్నది 45 పైసలు మాత్రమే. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం. ఇష్టమొచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. కేంద్ర పథకాలకు కేసీఆర్ పేర్లు మారుస్తుండు అంటున్నారు. ఇదే నా సవాల్.. మహారాష్ట్ర, కర్ణాటకలో చూద్దామా? తెలంగాణ పథకాలు ఉన్నాయా? అక్కడ మిషన్ భగీరథ, రైతు వేదిక, నల్లాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్యాంకర్, ట్రాక్టర్లు ఉన్నాయా? మీరు పాలించే రాష్ర్టాల్లో ఏ పురపాలికలోనైనా మేము చేస్తున్న అభివృద్ధి కనిపిస్తదా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
దేశానికి త్రీఐ మంత్ర అవసరం
జనాభాలో చైనాను దాటేసిన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే కాలానికి అనుగుణంగా విధానాల్లో మార్పులు రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాంటి విధానాలు లేకపోవడంవల్లే కులాలు, మతాల పేరిట చిచ్చు పెట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. యువత బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణలో టీ-హబ్, వీ-హబ్, టాస్క్ ద్వారా అద్భుతాలు ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. దేశ్‌పాండే ఫౌండేషన్ ద్వారా స్థాపించిన కాకతీయ సాండ్‌బాక్స్ స్టార్టప్ సంస్థ శనివారం నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ‘డెవలప్మెంట్ డైలాగ్ – థీమ్’ అంశంపై ఆయన ప్రసంగించారు. దేశానికి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ వంటి త్రీఐ మంత్ర అవసరమని తెలిపారు. రాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని అన్నారు.
కేటీఆర్ అమెరికాలో పుడితే ఎంత బాగుండునో..
కాకతీయ సాండ్‌బాక్స్ కో-ఫౌండర్ రాజురెడ్డి ఆరేండ్ల క్రితం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేటీఆర్‌తో ఏర్పడిన ఓ అనుభూతిని వివరించారు. ‘బోయింగ్ విమానయాన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో నేను పక్కనే కూర్చున్నాను. నాతో పాటు ఒక అమెరికా జాతీయుడు ఆ చర్చలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. బోయింగ్ ప్రతినిధులను ఎలాగైనా ఒప్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించాలనే తపన కేటీఆర్‌లో గమనించాను. హైదరాబాద్ కాకుండా ఇతర నగరాలు, దేశాల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టకూడదో ఓ వైపు బోయింగ్ ప్రతినిధులు వాదిస్తున్న సమయంలో కేటీఆర్ సాగించిన చర్చలతో సానుకూల ముగింపు రావడం నన్ను ఆశ్చర్యపర్చింది. కేటీఆర్ లాంటి వ్యక్తి అమెరికాలో ఉంటే ఎంత బాగుండునో అని పక్కనే ఉన్న అమెరికా జాతీయుడు అనటం నేనిప్పటకీ మర్చిపోలేను’ అని తన అనుభవాన్ని వివరించారు.