హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సాయిచంద్ అకాల మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని మంత్రి హరీశ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకుడిని, భవిష్యత్ నాయకున్ని కోల్పోయిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర విశేషమైనదని తెలిపారు. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. సాయిచంద్ మరణం పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల జగదీశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని తెలిపారు.
తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయిచంద్ ఎంతో కీలకమన్నారు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను పొందారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు.
తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్వరం ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేశారని వెల్లడించారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయిందన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటని చెప్పారు.
సాయిచంద్ మృతిపట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.