హైదరాబాద్ : సబ్జెక్టు ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ప్రాధాన్యతను దక్కించుకుంటున్నాయి. ఆ మాదిరిగానే మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకే విజయం దక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా భారత్ రాష్ట్ర సమితిపై కేటీఆర్ మాట్లాడారు.
ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ సమానం. కేసీఆర్ మా పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చి, దానికి సంబంధించిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించామన్నారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని కేటీఆర్ తెలిపారు. పార్టీ పేరు మార్పుపై ఎన్నికల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని చెప్పారు. గత 8 నెలల నుంచి దేశంలోని వివిధ రాజకీయ నాయకులు, రైతులు, ప్రజా సంఘాలు, ఆర్థికవేత్తలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఆ తర్వాతనే జాతీయ స్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించారు. 2024 ఎన్నికలే తమ టార్గెట్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిని చూసి పంజాబ్ ప్రజలు ఆప్‌కు ఓటేశారు. అక్కడ అధికారంలోకి వచ్చారు. అట్లనే తాము కూడా చేస్తాం. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మాకు పాజిటివ్ ఉంది. కర్నాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కర్నాటక, మహారాష్ట్ర సర్పంచులు కూడా మమ్మల్ని తెలంగాణలో కలపమని అడుగుతున్నారు. తమ పార్టీ ప్రభావం పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం తప్పదని కేటీఆర్ అన్నారు.