హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత ఏడేండ్లుగా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పట్టణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
ట్టమొదటి సారిగా స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో అటు గ్రామీణాభివృద్ధికి, ఇటు పట్టణాభివృద్ధికి, అటు వ్యవసాయానికి, ఇటు పరిశ్రమలకు, అటు గ్రామీణ కుటీర పరిశ్రమలకు, ఇటు ఐటీకి ఏకకాలంలో సమతుల్యమైన అభివృద్ధి సాధించే దిశగా సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. పట్టణాలు ఈరోజు గ్రోత్ ఇంజిన్లుగా మారాయన్నారు. పట్టణాలు విస్తరించి ఉన్న ప్రాంతం 2700 చదరపు మీటర్లు మాత్రమే. పట్టణ అభివృద్ధికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో మున్సిపాలిటీలు 142కు పెరిగాయి.
పౌరుడి భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వార్డు కమిటీలు ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. పట్టణాల్లో పచ్చదనం పెరగాలనే ఉద్దేశంతో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను పెట్టుకున్నాం. హరిత ప్రణాళికలు రూపొందించి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. టీఎస్ బీపాస్ చట్టం తెచ్చి మెరుగైన సేవలు అందిస్తున్నాం. పట్టణాలు అంటే నిధులు, విధులు మాత్రమే కాదు. ఆ పట్టణాల్లో పని చేసే పారిశుధ్య కార్మికులకు గతంలో సరిగా జీతాలు వచ్చేది కాదు. వారి వేతనాలు పెంచి పీఎఫ్, ఈఎస్ఐ అందిస్తూ ప్రతీ నెల జీతాలు అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. టీయూఎఫ్ఐడీసీ అనే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.