KTR | సూర్యాపేట : మా మీద మాట్లాడే మోదీది ఏ వారసత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. మా మీద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి అని కేటీఆర్ సూచించారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నిన్న ప్రధాని పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడితే చేతగాని మాటలు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్నాడు. బరాబర్ కుటుంబ పాలనే అందులో అనుమానమే లేదు. ఎందుకంటే.. కేసీఆర్ 4 కోట్ల మందికి కుటుంబ పెద్ద. 70 లక్షల మంది రైతులకు, వారి కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్నాడు. 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడి ఊతకర్ర అయ్యారు. 13 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి కింద లక్షా నూట పదహారు ఇచ్చి మేనమామ అయ్యారు. కేసీఆర్ కిట్ ఇచ్చి అన్నగా నిలబడ్డాడు. దళితబంధు ఇచ్చి దళితులను ఆదుకుంటున్నారు. ఇన్ని రకాలుగా అండగా నిలబడ్డ కేసీఆర్‌ది కుటుంబ పాలనే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలది వసుదైక కుటుంబం. ఈ కుటుంబానికి కేసీఆర్‌నే పెద్ద. ఇందులో నాకెలాంటి అనుమానం లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఊసులేనోడు వచ్చి వారసత్వ రాజకీయం అని అంటున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. పక్కా రాజకీయ వారసత్వమే. బీఆర్ఎస్ పార్టీది బరాబర్ రాజకీయ వారసత్వమే. రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాకున్నది తెలంగాణ తెగువ.. తెలంగాణ పౌరుషం. రాణి రుద్రమ్మ వారసత్వం కాబట్టే.. గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేసుకున్నాం. గొప్ప గొప్ప ఆలయాలు.. యాదాద్రి వంటి ఆలయాలను కట్టుకున్నాం. ఆనాడు కాకతీయులు చేసిన పనిని ఈనాడు మళ్లీ కేసీఆర్ చేస్తున్నారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం వారసత్వం మాది. అందుకే ఆనాడు కుమ్రం భీం జల్ జంగల్ జమీన్ అంటే.. ఈ రోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌ది. పక్కా మాది కుమ్రం భీం వారసత్వమే. బహుజన వీరుడు సర్వాయి పాపన్న వారసత్వం మాది. బడుగు వర్గాలకు బలమిచ్చేలాగా, చేతి, కుల వృత్తులకు కొత్త ఊపిరినిచ్చిన ప్రభుత్వం ఇది. దళిత జాతి వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ వారసత్వం మాది. గురుకుల విప్లవంతో అణగారిన బిడ్డల్లో అక్షర వెలుగులు నింపుతున్న ప్రభుత్వం మాది. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి అద్భుతాలు చేస్తున్న ప్రభుత్వం మాది. 1952, 1969, 2001, 2014 ఉద్యమాల్లో అసువులుబాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది. శ్రీకాంతాచారి ఆశయాల వారసత్వం మాది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని ఇవాళ విధానంగా మార్చుకొని, సమర్థవంతంగా అమలు చేస్తున్న రాజకీయ వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీల సాంస్కృతిక వారసత్వం మాది. తల్లి తెలంగాణకు జన్మనిచ్చి, అస్థిత్వాన్ని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం, వారసత్వం, కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని కేటీఆర్ ఉద్ఘాటించారు.
మా మీద మాట్లాడే మోదీది ఏ వారసత్వం అని కేటీఆర్ ప్రశ్నించారు. మాది జాతిపిత మహాత్మాగాంధీ వారసత్వం. నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం. దిక్కుమాలిన పార్టీ నీది. మా మీద మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడితే కాంగ్రెసోళ్లకైనా, బీజేపోళ్లకైనా మంచిది. చేతనైతే ఏం చేస్తారో చెప్పండి.. ఏం చేశారో చెప్పండి అని కేటీఆర్ సూచించారు.