హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ కానీ, సమానంగా కానీ వృద్ధి సాధించిన రాష్ర్టాన్ని దేశంలో చూపించగలరా? అం టూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సవాల్ విసిరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. దేశంలో అనేక అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ గురించి ఒక్క అభినందన కూడా తెలపలేదని ఆక్షేపించారు. రాజకీయాల కోస మే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారని విమర్శించారు.
హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్పై మోదీ చేసిన విమర్శలను మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విట్టర్లో తిప్పికొట్టారు. ‘తలసరి ఆదాయం అత్యధిక వృద్ధితో దేశంలోనే తెలంగాణ ముందున్నది. ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని, ఐటీ ఉద్యోగాల కల్పనలో అగ్రస్థానంలో ఉన్నదని వివరించారు.
గ్రీన్ కవర్లో 7.7% వృద్ధితో దేశంలోనే ముందున్నదని, తెలంగాణలోని 26 మున్సిపాలిటీలు అవార్డులు సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచాయని, దేశ జీడీపీకి అత్యధిక మొత్తాన్ని సమకూర్చే టాప్ 4 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని గుర్తుచేశారు. రా ష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక పాలసీ ఉన్నదని, ఈవోడీబీలో మూడో ర్యాంక్ సాధించిందని తెలిపారు. దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఉన్నదని, ప్రపంచానికి వ్యాక్సిన్ హబ్ గా విరాజిల్లుతున్నదని వివరించారు. జీఎస్డీపీతో పోల్చితే అతి తక్కువ అప్పు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని, 2015-20 వరకు దేశంలోనే ఉత్తమ భారతీయ నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందందని వివరించారు. దేశంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎస్డీఎస్ సర్వే స్పష్టంచేసిందని గుర్తుచేశారు.