బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్
రాజన్న సిరిసిల్ల, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్‌కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అన్ని పంచాయతీలకు కేంద్రమే పైసలిస్తే, దేశంలోని పల్లెలన్నీ తెలంగాణ లెక్కనే ఉండాలి కదా? అని ప్రశ్నించారు. పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి పథకాలకు అవార్డులు ఇస్తున్నది కేంద్ర పాలకులేనన్నది మరిచిపోవద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెడుతున్న రాష్ర్టాన్ని కేంద్రం వెన్నుతట్టి ప్రోత్సహించాలని, కాళ్లల్లో కట్టెలుపెట్టి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
గురువారం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో గంభీరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కట్కం శ్రీధర్ మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్పంచులకు రావాల్సిన పైసల కోసం కొట్లాడుతున్నానంటూ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి పోరాటం చేయాలని సవాల్ చేశారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 2017 నుంచి ప్రతినెలా ఠంచన్‌గా నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. సర్పంచులపై, గ్రామపంచాయతీలపై, స్థానిక ప్రభుత్వాలపై కేంద్రానికి ప్రేమ ఉంటే వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.