హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేసిన రాష్ట్రాన్ని చూపించగలరా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. గురువారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘కర్ణాటక యువతను విజయవంతంగా మోసం చేసిన రాజకీయ నిరుద్యోగ స్కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నది’ అని ఎద్దేవా చేశారు.
2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ యువతను విజయవంతంగా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కరువు ప్రాంతం అనే స్థాయి నుంచి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందంటే మాటలా! అని అన్నారు. తొమ్మిదేండ్లలోనే రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు.
తెలంగాణ పవర్ఫుల్ లీడర్ కేసీఆర్‌తో పవర్‌ఫుల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలు, అస్థిరమైన విద్యుత్తు సరఫరా, పవర్ హాలిడేస్‌తో దెబ్బతిన్న ప్రాంతం ఇప్పుడు తలసరి విద్యుత్తు వినియోగంలో అగ్రస్థానంలో ప్రకాశిస్తున్నదని వెల్లడించారు. పవర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి, విస్తరించడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసిందని వివరించారు. గ్రిడ్ వైఫల్యం సంభవించినప్పుడు కూడా నిరంతర విద్యుత్తు సరఫరా కోసం నగరాన్ని పవర్ ఐలాండ్‌గా మార్చామని గుర్తుచేశారు.