కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, 2.20 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ మాట్లాడటం గురవింద సామెత కన్నా హీనంగా ఉన్నది. ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి, మోసం చేసిన ప్రధాని మోదీని తెలంగాణ యువత ఎన్నటికీ మర్చిపోదు
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అత్యంత నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్న 16 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదని మండిపడ్డారు. శనివారం వరంగల్‌లో మోదీ పర్యటనపై ఒక ప్రకటనలో స్పందించిన ఆయన.. ఈ పర్యటన ఆత్మవంచన, పరనింద అన్న తీరుగా కొనసాగిందని విమర్శించారు. ప్రధాని ప్రసం గం మొత్తం అసత్యాలేనని తెలిపారు. రాష్ర్టానికి ఏం చేస్తారో చెప్పకుండా, ఉపన్యాసం ఇచ్చి ఉత్త చేతులతో వెళ్లిపోవటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన ఒక్క మంచి పనైనా చెప్తే బాగుండేదన్నారు. రాష్ర్టానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని గుర్తుంచుకొని రాబో యే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తెలంగాణ నుంచి తన్ని తరిమేస్తారని స్పష్టం చేశారు.
గుజరాత్ కా సాత్.. గుజరాత్ కా వికాస్
45 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్ అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే రిపేర్ షాప్ పేరుతో ప్రధాని తెలంగాణకు ఏదో గొప్ప మేలు చేసినట్టు చెప్పటం ఇక్కడి ప్రజలను అవమానించటమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా తన సొంత రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీని మోసపూరితంగా తరలించుకుపోయిన ప్రధాని మోదీ సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ నినాదం.. గుజరాత్ కా సాత్, గుజరాత్ కా వికాస్‌గా మారిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్లను పకనబెట్టి చూపిన వివక్షను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బీజేపీకి గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
మీ మోసాన్ని యువత మర్చిపోదు
కేంద్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, 2.20 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిన తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడటం గురవింద సామెత కన్నా హీనంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. లక్షల ఉద్యోగాలను అందించే ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి మోసం చేసిన ప్రధాని మోదీని తెలంగాణ యువత ఎన్నటికీ మర్చిపోదని స్పష్టం చేశారు.
వాటికి గవర్నరే కారణం
రాష్ట్రంలోని యూనివర్సిటీల ఖాళీల గురించి మాట్లాడిన ప్రధాని, దేశంలోని సెంట్ర ల్ యూనివర్సిటీల ఖాళీలను ముందుగా భర్తీ చేయాలని కేటీఆర్ హితవు చెప్పారు. యూనివర్సిటీల ఖాళీల భర్తీ కోసం తమ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని బీజేపీ నాయకురాలు, ప్రస్తుత గవర్నర్ తమిళిసై తొకిపెట్టిన విషయంపైనా ప్రధాని స్పందించి ఉంటే బాగుండేదని చురక అంటించారు.
రైతుల ఆదాయం రెట్టింపు సంగతి ఎక్కడ?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని మాటలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. నల్ల చట్టాలతో 700 మంది రైతుల మరణాలకు కారణమైన ప్రధాని వ్యవసాయం గురించి మాట్లాడటం దుర్మా ర్గం అని మండిపడ్డారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, విస్తీర్ణం, సాగునీటి విప్లవం, రైతు సంక్షేమ పథకాలు ఇలా.. ప్రతి అంశంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్న విషయం ప్రధాని తెలుసుకుంటే మంచిదని తెలిపారు.
ఉడత ఊపులకు, పిట్టబెదిరింపులకు భయపడం
మోదీ కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన దానికంటే దారుణంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. అనేక రాష్ట్రాల్లోని బీజేపీ నేతల కుటుంబ సభ్యు లు, తన క్యాబినెట్‌లోని మంత్రుల వరకు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు.తెలంగాణ రాష్ర్టాన్ని ఒక కుటుంబంగా, తెలంగాణ ప్రజలను కుటుం బ సభ్యులుగా భావించి, వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ చేపిస్తామన్న మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇలాంటి ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులతో కలవరపడే ప్రభుత్వం, నాయకత్వం తమది కాదన్నారు.