తెలంగాణలో పండిన వరిధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే.. కేంద్ర సర్కారు రైతులను, ప్రజలను అవమానించిందని, బీజేపీ సర్కారు వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం వైఖరికి నిరసనగా యాక్షన్‌ప్లాన్ ప్రకటించారు. ఈ నెల 4న మండలకేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో రైతులందరూ పాల్గొనాలని కోరారు. వారిని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇన్చార్జీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అలాగే, ఏప్రిల్ 6న తెలంగాణలోని నాలుగు ప్రధాన జాతీయ రహదారులపై నిరసన చేపడుతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నాగ్‌పూర్,ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. ఇందులో కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఏప్రిల్ 7న 32 జిల్లాకేంద్రాల్లో మంత్రులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతామన్నారు.
ఏప్రిల్ 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి రైతు తన ఇంటిమీద నల్లజెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ భ్రష్ట రాజకీయానికి నిరసన తెలుపాలన్నారు. అలాగే, ప్రతిగ్రామంలో కేంద్ర సర్కారు దిష్టిబొమ్మ దహనం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
చివరగా ఏప్రిల్ 11న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో నిరసన చేపడుతామని చెప్పారు. కేంద్రం మెడలు వంచేందుకు ఐదంచెల కార్యాచరణ రూపొందించామన్నారు. కేంద్ర సర్కారు తన వైఖరి మార్చుకేనేదాకా రాజీలేకుండా కొట్లాడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.