జగిత్యాల : దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఆరోపించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ (BRS) లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పేదల గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు. ఆ రాష్ట్రాల్లో రూ.4వేల పింఛన్, రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తలాపున గోదావరి (Godavari) పరవళ్లు తొక్కుతున్నా వాటిని సద్వినియోగించుకోవాలన్న సోయి ఎందుకు రాలేదని నిలదీశారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్ని, ఇన్నీ కావని పేర్కొన్నారు. కరెంట్, విత్తనాలు, సాగు, తాగు నీటి కొరతలతో సతమతమయ్యారని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో నాటి సమస్యలన్నీ దశలవారీగా తీరాయని పేర్కొన్నారు. ప్రజలకు మంచిచేయాలనే ఆలోచన ఉంటే సమస్యలను పరిష్కరించవచ్చని సీఎం నిరూపించారని అన్నారు.
వైద్యాన్ని, విద్యను ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమానికి వారి అభ్యున్నతికి పథకాలు అమలు చేస్తున్నది ఒక్క తెలంగాణనేనని అన్నారు.