హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని బంజారా సేవా భవన్లో నిర్వహించిన ట్రాన్సెండ్ (TRANSCEND) ప్రిన్సిపాల్స్ సెమినార్లో మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.పేద పిల్లలు చదువులో ముందుండాలంటే గురుకుల విద్య ద్వారానే సాధ్యమని విశ్వసించిన సీఎం కేసీఆర్..రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారని చెప్పారు.
తెలంగాణలో గురుకుల విద్యావిధానంపై దేశంలోనే చర్చ జరుగుతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల మంత్రులు తెలంగాణ గురుకుల విద్యాసంస్థలను అధ్యయనం చేసేందుకు వచ్చి వెళుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాలను ఇప్పుడు 1,004కు పెంచుకున్నట్లు వివరాలను వెల్లడించారు.
నాడు వసతుల లేమితో ఎంతో మంది విద్యార్థులు గురుకులాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారని.. నేడు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన విద్యా విధానం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకులాల్లో ఎంతో మంది ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు.
గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి పౌష్టికాహరం అందించడంతో పాటు అన్ని వసతులు కలిగిన సొంత భవనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా గురుకుల సిబ్బందిని మంత్రి కొప్పుల అభినందించారు. విద్యార్థులను సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్స్ కార్యదర్శి నవీన్ నికోలస్, తదితరులు పాల్గొన్నారు.