పెద్దపల్లి : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం సింగరేణి గాలింపును వేగవంతం చేసింది. తేజ, జయరాజ్, శ్రీకాంత్ ఆచూకీ కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులను పర్యవేక్షించేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాజెక్టులోకి దిగారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్సీ వెంకట్రావ్, టీజీబీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా రెస్క్యూం బృందంతో మాట్లాడి కార్మికుల గురించి, సంఘటన గురించి ఆరా తీశారు. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో సోమవారం మధ్యాహ్నం సైడ్, పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రాత్రి 7 గంటల ప్రాంతంలో సురక్షితంగా బయటపడ్డారు. మరొకరు ఇవాళ ఉదయం బయటకు రాగా ముగ్గురూ బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు. తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం అందక తమ వారు ఎలా ఉన్నారోనని కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు.