ధర్మపురి : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో రూ.66కోట్ల వ్యయంతో మంత్రి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన బస్తీ – మనబడి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, రూ.30లక్షల వ్యయంతో నిర్మించిన మేరు సంఘం భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సునిల్ తదితరులు పాల్గొన్నారు.