హైదరాబాద్ : ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోస్తూ కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ప్రతిష్టను మంటగల్పుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. రాజ్యసభ సభ్యుడుదామోదర్ రావు, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో కలిసి శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లి తమ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీజేపీకి ప్రజలంటే పట్టింపు లేదు. రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ నాయకులు నిరాధారమైన ఆరోపణలకు దిగితే..ఇక్కడి గల్లీ నాయకులు, కాషాయ గుండాలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ నాయకులు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ పై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతతకు, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ లు కుట్రలు పన్నుతున్నారన్నారని ఆరోపించారు.
శాంతికి భంగం కలిగించే బీజేపీ నాయకుల చర్యలను, రౌడీయిజాన్ని సహించవద్దని, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.