హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన తీవ్ర విచారకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల మొన్న రైతులు, నేడు యువత రోడ్లపైకి
రావాల్సి వచ్చిందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. సికింద్రాబాద్ ఘటన వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నదని, ఈ ఘటనల వెనుక కూడా టీఆర్ఎస్సే ఉందా? అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా? అని అడిగారు.ఓ బాధ్యతగల ఎంపీ అనే విషయం మరువొద్దని, అర్థంపర్థం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలు కావొద్దని బండి సంజయ్‌కి హితవు పలికారు. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతున్నందున.. దీనిపై పునరాలోచన చేయాలని ప్రధాని మోడీని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.