కరీంనగర్ : గోదావరి ఖనిలో రామగుండం మెడికల్ కాలేజీ ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల ప్రాంగణం, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ముందున్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రూ. 510 కోట్ల నిధులతో అధునాతన సదుపాయాలతో మెడికల్ కాలేజీని నిర్మిస్తామన్నారు. ఈ కాలేజీ 2022 విద్యాసంవత్సరంలో ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలోని నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, కాల్వ శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వీ రమణారెడ్డి, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, నూతి తిరుపతి ఉన్నారు.