Singareni | నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 7: సింగరేణి బ్లాకులను ప్రైవేట్‌కు అప్పగించాలనే కేంద్రం యోచనపై కార్మికులు భగ్గుమంటున్నారు. తెలంగాణకు ఆయువుపట్టుగా ఉన్న సింగరేణి ఉసురు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న సంస్థను నిర్వీర్యం చేస్తే సహించబోమని వారు స్పష్టం చేస్తున్నారు. శనివారం ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సింగరేణి సెగ తగిలేలా సింగరేణి వ్యాప్తంగా మహాధర్నాకు కార్మికులు, కార్మిక సంఘం నేతలు సిద్ధమయ్యారు.
ప్రధాని స్పందించాలి: కొప్పుల
సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే అంశంపై, బొగ్గు బ్లాకులను వేలం వేసే విషయమై ప్రధాని మోదీ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆందోళనలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్, టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సింగరేణి కార్మికుల నిరసన సెగ తగిలేలా తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
సింగరేణిపై ప్రతి సందర్భంలోనూ విషం కక్కుతూ ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నదని, సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు సిద్ధమవుతున్నదని, దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. వందలాది కోట్ల రూపాయల లాభాల్లో కొనసాగుతూ కార్మికులకు 30 శాతం లాభాల వాటా, ఇతర అన్ని వసతులు కల్పిస్తూ ముందుకు సాగుతున్న సంస్థను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌కు అప్పగించే కుట్రలో భాగంగా ప్రతిసారి వేలం ప్రక్రియను చేపడుతున్న నరేంద్రమోదీకి బుద్ధి చెప్పేలా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్‌కుమార్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగెర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు బావులు వేలం వేస్తే ఊరుకోం..
బొగ్గుబావులను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్‌సైరన్ మోగిస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, సండ్ర వెంకటవీరయ్య హెచ్చరించారు. శుక్రవారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సింగరేణి మహాధర్నాకు పిలుపునిచ్చారని, కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని కోరారు. కేంద్రం ప్రైవేటీకరణ చేయబోమని చెప్తూనే.. సింగరేణి బొగ్గుబావులను వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేటీకరిస్తే ఎంతోమంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన పార్టీలకతీతంగా కేంద్రంపై పోరు చేయాలని పిలుపునిచ్చారు.
ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లోని కార్మికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు శనివారం జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
నల్ల బంగారాన్ని ప్రైవేట్‌కు అప్పగించొద్దు
తెలంగాణకు ఆయువుపట్టుగా ఉన్న సింగరేణి ఉసురు తీసేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని, అందుకే బొగ్గు గనులను ప్రైవేటుకు అప్పజెప్పేందుకు సిద్ధమైందని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆరోపించారు. నల్ల బంగారాన్ని ప్రైవేట్‌కు అప్పగిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణపై విషం చిమ్ముతూ, సవతి ప్రేమను ఒలకబోసే కేంద్రంలోని బీజేపీ సర్కార్ కన్ను బంగారు బాతులాంటి సింగరేణిపై పడిందని విమర్శించారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ఆ ప్రకటనపై యూటర్న్ తీసుకోవడం దారుణమని మండిపడ్డారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.