హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మతి భ్రమించిందని, అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణను జీర్ణించుకోలేక అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళితుల జనోద్ధరణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని విమర్శించే నైతిక అర్హత బండికి లేదని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేసీఆర్పై, తెలంగాణ సర్కారుపై విమర్శలు మానుకోవాలని, వెంటనే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం అవిషరించుకున్న సందర్భంగా సంజయ్ విమర్శలు అర్దరహితమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయంగా ఎదురోలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా? నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకు విమర్శిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకోం: రసమయి
అంబేద్కర్ను అవమానపరిస్తే ఊరుకోబోదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ బీజేపీని హెచ్చరించారు. బీజేపీ కుసంస్కారాన్ని ప్రజ ల్లో ఎండగడతామని చెప్పారు. బీజేపీ మొదటి నుంచి దళితవర్గ వ్యతిరేక పార్టీగా వ్యవహరిస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. దళితవర్గం నుంచి వచ్చినవారిని బీజేపీ అంటరానివారిగా చూస్తున్నదని, అంబేద్కర్ విషయంలోనూ ఆ పార్టీ అదే చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.