Minister Koppula Eshwar | స్వతంత్ర సమరయోధుడిగా, ప్రజాస్వామిక ప్రజాప్రతినిధిగా నవసమాజానికి ఆదర్శప్రాయుడు తోటపల్లి గాంధీ.. బోయినపల్లి వెంకట రామారావు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. బోవెరా 103 జయంతి ఉత్సవం సందర్భంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని బోవెరా భవన్లో ఆయన తనయుడు బోయినపల్లి హన్మంతరావు, శాసన మండలి సభ్యుడు మధుసూదనాచారి, ప్రముఖ పాత్రికేయుడు దేవులపల్లి అమర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, శాతవాహన వైస్ చాన్సెలర్ మల్లేశ్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బోవెరా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుడిగా.. ఆ తర్వాత ప్రజాప్రతినిధిగా ప్రజల మన్ననలు పొందిన మహనీయుడని కొనియాడారు. తన జీవన ప్రయాణంలో నిత్యం ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి పాటుపడిన మానవతావాది, కుల వ్యవస్థను బహిష్కరించిన గొప్ప వ్యక్తి అన్నారు. కరీంనగర్ గాంధీగా, బోవెరా అని ప్రజలు ప్రేమతో పిలుచుకునే బోయినపల్లి వెంకటరామారావు ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రగతిశీల ప్రజా వాగ్గేయకారిణి విమలక్కకు బోవెరా కవితా పురస్కారాన్ని.. అందించి సన్మానించారు.