హైదరాబాద్ : ఎస్సీ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప మధ్యలో నిలిపి వేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి చేసినందుకు సహకరించాలి తప్ప, బాధ్యత లేకుండా వ్యవహరించవద్దని హితవు పలికారు. ఏ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వం ప్రారంభించిన పనులు, కమ్యూనిటీ హాల్లో భవన నిర్మాణాలు ఎమ్మెల్యేల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి పూర్తి అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
నిధులు లేవన్న సాకుతో పనులు నిలిపివేస్తే ప్రయోజనం ఏముంటుందన్నారు. ఇప్పటికైనా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినట్లయితే వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తారని మంత్రి చెప్పారు. చిన్న చిన్న పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు దొరకరని, స్థానిక సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, లోకల్ లీడర్ల సహాయంతో పూర్తి చేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ పనితీరుపై మంత్రి సమీక్షించారు.
నెలలో ఒకటి రెండు సార్లు హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లో కిచన్, స్టోర్ రూములు పరిశీలించాలన్నారు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సరైన వసతులు ఉన్నాయా? లేదా? ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లపై గురించి అధికారులను అడిగి తెలుసు కున్నారు. విద్యా వైద్య రంగం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, అడిషనల్ కమిషనర్ ఉమాదేవి, స్పెషల్ సెక్రెటరీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.