నల్గొండ : ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మునుగోడులో టీఆర్ఎస్దే విజయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కారు గుర్తును పోలిన గుర్తులతో పార్టీకి ఇబ్బంది లేదని, ఓటర్లంతా చైతన్యవంతులన్నారు. చండూరు మండలం తాస్కానిగూడెంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విశ్వసనీయత పెరిగిందని, అదే మునుగోడు ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు.
మోదీ నుంచి మునుగోడు అభ్యర్థి వరకు అంతా అసత్య ప్రచారమే చేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి కేవలం డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలి రాష్ట్రాల్లోనే అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 150 మంది మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మంత్రి వెంట పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణ్, టీఆర్ఎస్ నేతలు హరనాథ్ రావు, పల్లె రవి, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.