హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. దేశంలోనే అతిపెద్ద, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఐమాక్స్ పకనే ఉన్న మైదానంలో నిర్వహించే బహిరంగ సభ కోసం 40 వేలకు పైగా కుర్చీలు వేయాలని సూచించారు.
క్యూలైన్లు, పూలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆవిష్కరణకు నాలుగు రోజుల సమయమే ఉండటంతో విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దేశంలోనే అతి పెద్ద, 125 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ విగ్రహం తెలంగాణకే ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం, మరోవైపు అమరుల స్మారకం, అంబేదర్ భారీ విగ్రహం హైదరాబాద్‌కు మణిహారంగా నిలువనున్నాయి. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ కమీషనర్ యోగితా రానా, మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.
సోమవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు