హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : దేవాదాయ శాఖలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా శ్రీకారం చుట్టిన ‘ఈ-ఆఫీస్’ అటకెక్కింది. శాఖలోని ప్రతి ఫైల్‌ను జాప్యం లేకుండా చకచకా పూర్తిచేసే ఉద్దేశంతో ఈ ఏడాది జూలై 31న ఈ-ఆఫీస్ కార్యకలాపాలను ప్రారంభించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇక నుంచి ఈ ఆన్లైన్ పద్ధతిలోనే ఫైళ్లు జరుగుతాయని, శాఖలో అవినీతిని, ఆలయాలు, సిబ్బంది ఫైళ్లు త్వరగా పూర్తిచేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని మంత్రి అప్పట్లో చెప్పారు. కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. మంత్రి కాదు.. ఎవరు చెప్పినా మారేది లేదు అన్నట్టు ఈ-ఆఫీస్‌ను మూలకునెట్టిన సిబ్బంది, పాత పద్ధతిలో పనులు చేసుకుపోతున్నారు. చేతివాటానికి అనుకూలంగా ఉన్న మాన్యువల్ ప్రక్రియనే కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
టపా నుంచి కమిషనర్ చాంబర్ వరకు ప్రతిచోట ఒక ఫైల్ పురోగతిని పర్సనల్ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉండగా అదికూడా నామమాత్రంగానే జరుగున్నది. దీని వల్ల ఫైల్స్ ఎక్కడికక్కడే మూలనపడుతున్నాయని శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఫైల్‌ను పీఆర్లో నమోదు చేయడం దగ్గరి నుంచి ఫైల్ ఏ దశలో ఉన్నదో, ఏ అధికారి పరిశీలిస్తున్నారో, ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవ్వాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఏదీ ఆచరణలో లేకుండా పోతున్నది. ఫలితంగా దరఖాస్తులు పెట్టుకున్న అర్చక, ఉద్యోగులతో పాటు ఆలయాల వ్యవహారాలు కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణలోని ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కారుణ్య నియామకాల ఫైల్ జాప్యంపై బాధితులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ-ఆఫీసు విషయంలో ఉన్నతాధికారులను మందలించినా సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదనే చర్చ జరుగుతున్నది.
ఈ-ఆఫీస్ ప్రారంభించినప్పటికీ తమకు శిక్షణ ఇవ్వలేదని మొదట్లో సాకులు చెప్పారు. ఆ తర్వాత కమిషనర్లు మారడం, అధికారిక కార్యకలాపాలు, ఉత్సవాలు, అంతా హడావుడి జరగడంతో ఫైళ్లు ఆగిపోతున్నాయంటూ ఉన్నతాధికారులకు చెప్పి పాత పద్ధతిలో కొనసాగిస్తున్నారు. అయితే దీనికి కొందరు సెక్షన్ సిబ్బంది చేతివాటమే ప్రధాన కారణమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఫైళ్ల ప్రక్రియ వేగవంతమై, ప్రతి ఒక్కరికీ దాని పురోగతి తెలిస్తే తమ జేబులు నిండవని భావించి ఈ-ఆఫీసును అటకెక్కించారు. ప్రస్తుతం తమ వద్దకు వచ్చిన ఫైల్లో తమకు నచ్చినవి, అదికూడా తమకు ముడుపులు ముట్టిన ఫైళ్లు మాత్రమే కమిషనర్ పేషీ దాకా చేరుతాయని, మిగతావి మూలకుపడ్డట్టేననే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రధాన సెక్షన్లలో ఫైల్‌కో రేటు నిర్ణయించారని, ఐదు నుంచి పది వేలు అవుతాయని.. కాగితం పెట్టడానికి, ఆ తర్వాత పనైపోతే ఆర్డర్ తీసుకునే సమయంలో మరికొంత ముట్టజెపితే తప్ప తమ పనులు జరగడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా బహిరంగ రహస్యమేనని, ఈ ముడుపుల బాగోతం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోరని చెప్పుకొంటున్నారు. సిబ్బంది చేతివాటం కారణంగా ఈ-ఆఫీసు మూలకుపడి కమిషనర్ పేషీలో ఫైళ్లన్నీ కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నా యి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న కమిషనర్ హరీశ్, తాను వచ్చిన రోజు వెంటవెంటనే ఫైల్స్ చూస్తున్నప్పటికీ నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నవి ఆయనకు చేరడం లేదు. తాము డబ్బులిస్తేనే సెక్షన్ సిబ్బంది ఆ ఫైల్ కదిలిస్తామంటున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ప్రధాన సెక్షన్లలో కొన్నేళ్లుగా ఒకే సెక్షన్లో, ఒకే సీటులో ఉంటున్న క్లర్కుల కారణంగానే ఈ-ఆఫీసు అమలుకాకుండా పోతున్నదని దేవాదాయశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇటీవల సూపరింటెండెంట్ల బదిలీ లు జరిగినా, క్లర్కులకు మాత్రం బదిలీలు కా లేదు. వారిని కట్టడి చేయడంలో ప్రధాన కా ర్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులకు సాధ్యపడడం లేదని, ఈ విషయంలో మంత్రి ,, అధికారులు చొరవ తీసుకుంటే తప్ప ఫైళ్లకు మోక్షం లభించదని పేర్కొన్నారు.