హైదరాబాద్: అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఈ కేసులో నాగార్జునతోపాటు నాగచైతన్య, అమల వాగ్మూలాలను కోర్టు నమోదుచేసింది. మంత్రి కొండా సురేఖ సైతం కోర్టులో వాగ్మూలం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆమె గైర్హాజరయ్యారు. తన వాగ్మూలాన్ని లాయర్ ద్వారా పంపించారు. అయితే బుధవారం ఈ కేసులో మరోసారి విచారణకు రానున్నది. మంత్రి సురేఖ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది. దీంతో ఆమె హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
కాగా, మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి కోర్టు మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ వాంగ్మూలాలను నమోదు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు.. ఇప్పుడు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలాలను రికార్డు చేయనున్నది.
అయితే కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, కన్వెన్షన్‌హాల్ కూల్చడానికి, మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు నాగార్జున తన పిటిషన్లో కోరారు. కన్వెన్షన్ సెంటర్ తనకు (నాగార్జున) చెందినదని, నాగచైతన్య-సమంత విడాకులకు లింక్ లేదని, కేటీఆర్‌పై నిందారోపణలు చేసి అక్కినేని కుటుంబానికి ఉన్న పరువుకు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జాతీయ చానళ్లు కూడా మంత్రి మీడియా సమావేశాన్ని ప్రసారం చేశాయని తెలిపారు. బిగ్బాగ్ హోస్ట్‌గా, సినిమా హీరోగా, నిర్మాతగా తనకు, తమ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలను పాడుచేసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, కావాలని ఆమె తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని, కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలని కోర్టును కోరారు.