వరంగల్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమేందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తనశాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించటమేనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పరిపాలనా పరిధిలో మంత్రిస్థాయిలో నిర్వహించాల్సిన సమీక్షను ఎమ్మెల్యే నిర్వహించడం మంత్రిగా తనకు తీరని అవమానమని, ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తున్నానని, రాజ్యాంగబద్ధంగా తనకు అప్పగించిన బాధ్యతల పరిధిలో పరిపాలన, విధాన నిర్ణయాలను, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయటం వంటి అంశాలు రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. తన విధులను తాను నిర్వహిస్తుంటే సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ మంత్రినైన తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, తన కార్యాలయానికి తెలియజేయకుండా బొగ్గులకుంట (హైదరాబాద్)లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ సహా ఇతర అధికారులతో సమీక్ష చేయటం అత్యంత విచారకరమని అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తన నియోజకవర్గ పరిధిలో ఏవైనా సమస్యలుంటే దేవాదాయ శాఖ మంత్రిగా తనను కానీ, అధికారులను కానీ సంప్రదించాలని, అలాకాకుండా తానే సమీక్ష నిర్వహించడం సరికాదని కొండా సురేఖ పేర్కొన్నారు. సమీక్ష సమావేశం నిర్వహించడమే కాకుండా మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయడం, దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించడం, నెలరోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కడియం చర్య మంత్రిని విస్మరించడమేనని తెలిపారు. గతంలోనూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తనపై దుష్ప్రచారం జరిగేలా ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయనే విషయాన్ని ఆమె గుర్తుచేశారు. గతంలోనూ తమపై కడియం అనేక కుటిల యత్నాలు చేశారని వివరించారు.
కడియం శ్రీహరిపై ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. పరిపాలనా వ్యవస్థలో అనవసర జోక్యం చేసుకునే చర్యలు ప్రోత్సహించే విధంగా కడియం ప్రవర్తించారని దుయ్యబట్టారు. అలాంటి చర్యలు ప్రభుత్వ పరిపాలన సమన్వయాన్ని దెబ్బతీయటమే కాకుండా అధికార యంత్రాంగంలో కూడా అయోమయ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉన్నదని సూచించారు. క్రమశిక్షణతోపాటు, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశమైనందున పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.