హనుమకొండ/హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 21 : హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఈ సారి మంత్రుల అత్యుత్సాహం.. హడావుడి.. తడబాటుతో వెలవెలబోయాయి. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడే ఆడబిడ్డల్లో అసహనం కనిపించింది. ఏడాదికోసారి వచ్చే పండుగను ఈసారి సరిగ్గా జరుపుకోలేకపోయామని ఆవేదన వ్యక్తమైంది. హనుమకొండ వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలను ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ‘ఎంగిలపూల బతుకమ్మ’పై మంత్రులు, ప్రజాప్రతినిధులు తలోమాట మాట్లాడి అభాసుపాలయ్యారు. బతుకమ్మ ఆట పక్కకు పోయి ప్రసంగాలు, హడావుడికే సమయం సరిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడ మంత్రులు చేసిన తడబాటు ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంగిలిపూల బతుకమ్మను కాస్తా మంత్రి సురేఖ సద్దుల బతుకమ్మ చేశారు. ఆమె ప్రసంగంలో ‘సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఇక మంత్రి పొంగులేటి మరో పేరు పెట్టారు. ఎక్కడా లేని.. ‘సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు’ అనడంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. మేయర్ గుండు సుధారాణి ఏకంగా ఎంగిలి బతుకమ్మ అనేశారు. ఇలా మంత్రులు, మేయర్ ఎంగిలిపూల బతుకమ్మ పండగపై తలోమాట మాట్లాడటంపై మహిళలు చెవులుకొరుక్కున్నారు.
ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార పాటలను నిర్వాహకులు పెట్టడంతో ఆ యన అసహనం వ్యక్తంచేశారు. బతుకమ్మ వేడుకల్లో తన పాట పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తన పాట కాకుండా బతుకమ్మ పాటలు పెట్టాలని సూచించారు. వెంటనే నిర్వాహకులు అప్రమత్తమై బతుకమ్మ పాటలు పెట్టారు.
ఏటా వేయిస్తంభాల గుడిలో అట్టహాసంగా జరిగే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఈసారి వీఐపీల హడావిడి, పోలీసుల హంగామానే కనిపించింది. మంత్రులు వచ్చేదాకా పాటలు పెట్టకపోవడమే కాకుండా వాళ్లు వచ్చాక ప్రసంగాలతోనే సరిపోయిందని పలువురు మహిళలు మండిపడ్డారు. ఏటా బతుకమ్మ ఆటపాటలతో వేయిస్తంభాల గుడి పరిసరాలు మార్మోగేవని, ఈ ప్రాంతమంతా సందడిగా కనిపించేదని, ఈ సారి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో పండుగను సరిగ్గా జరుపుకోలేకపోయామని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను పేర్చి ఆలయానికి తీసుకువచ్చిన తర్వాత మంత్రుల రాకతో ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుకొనేందుకు స్థలం లేక బయటనే ఆడుకోవాల్సి వచ్చింది. మంత్రుల రాక సందర్భంగా (హనుమకొండ, కేయూసీ, కాజీపేట, మడికొండ) హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ నుంచి తప్ప అన్ని స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించి భారీ బందోబస్తు కల్పించడంతో ఆలయ ప్రాంగణం వారితోనే నిండిపోయింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం అకడే ఉండటంతో మహిళలు బతుకమ్మ ఆడేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఒకానొక సందర్భంలో ‘అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు వీళ్లను’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ స్నేహ శబరీష్, తదితరులు పాల్గొన్నారు.