Konda Surekha vs Ponguleti | వరంగల్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీనియర్ ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా కొనసాగుతున్న.. మాకు ఆత్మాభిమానం ఉండొద్దా?’ అని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్ఠానం దగ్గర తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. తమపై ఆధిపత్యం చెలాయించడమే పనిగా పెట్టుకున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యహరిస్తున్నారని ఆమె మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మొదటి నుంచి తమ వ్యతిరేక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారని పార్టీ అధిష్ఠానానికి నివేదించారు. ఆమె చెప్పిన అనేక విషయాలను సావధానంగా విన్న పార్టీ అధిష్ఠానం.. అంతా తమకు తెలుసని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు అవసరమైన సూచనలు చేస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఇన్చార్జి మంత్రి అనే సాకును చూపి అన్నీ తానే నడుచుకుంటున్నారని, మేడారం పనుల టెండర్లను పిలవడంలో తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. తాను గతంలో.. ఆ మాటకు వస్తే ఇప్పుడూ ఇతర జిల్లాలకు ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నానని, తానెప్పుడు ఇతరుల శాఖలపై పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేయలేదని, కానీ, మంత్రి పొంగులేటి మాత్రం అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారని నివేదించినట్టు సమాచారం. పొంగులేటి విషయమై పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు కొండా దంపతులు ఈనెల 13న ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది.